తలమడుగు మండలంలోని ఝరి గ్రామంలో జిల్లా కలెక్టర్ రాజర్షి షా సుడిగాలి పర్యటన చేశారు. వాటర్ షేడ్ యాత్ర ప్రారంభోత్సవంలో భాగంగా చెక్ డ్యామ్ నిర్మాణానికి భూమిపూజ చేశారు. ఇందిరా పథకం కింద ఉపాధి పొందుతున్న పనులను ప్రత్యక్షంగా పరిశీలించారు. అధికారుల సమక్షంలో గ్రామస్తులతో మాట్లాడారు.
తదుపరి ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొన్న కలెక్టర్, వాతావరణ సమతుల్యత కల్పించడంలో నీటి సంరక్షణ, మొక్కలు నాటడం ఎంత ముఖ్యమో వివరించారు. పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ తమ వంతు పాత్ర పోషించాలని పిలుపునిచ్చారు. పచ్చదనం పెరిగితే ఆరోగ్యకర వాతావరణం ఏర్పడుతుందని చెప్పారు.
కలెక్టర్ రాజర్షి షా, గ్రామంలోని ఓ సన్న బియ్యం లబ్ధిదారుని ఇంట్లో భోజనం చేసి ప్రజలకు సాన్నిహిత్యాన్ని చాటారు. పరిశుభ్రత, ఆరోగ్యం, వాతావరణం అనుసంధానమైనవేనని గుర్తుచేశారు. ప్రతి ఇంటి పరిసరాలు శుభ్రంగా ఉంచుతూ మొక్కలు నాటి సంరక్షించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిది అన్నారు.
ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు, మండల అధికారులు, తాసిల్దార్ రాజమోహన్, ఎంపీడీవో చంద్రశేఖర్, మహిళలు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. గ్రామస్థుల సందేహాలు నివృత్తి చేస్తూ అధికారులు పలు సూచనలు చేశారు. పర్యావరణ పరిరక్షణపై గ్రామస్థులకు అవగాహన కల్పించారు.