ఉత్తరప్రదేశ్‌లో ఆధార్ కార్డుల బయోమెట్రిక్ వివరాలను తారుమారు చేస్తున్న హైటెక్ ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. ఈ ముఠా 12 రాష్ట్రాల్లో 1,500 మందికి పైగా వ్యక్తుల ఆధార్ వివరాలను చలించిందని పోలీసులు వెల్లడించారు. సంభాల్ ఎస్పీ కృష్ణ కుమార్ బిష్ణోయ్, ఏఎస్పీ అనుకృతి శర్మ నేతృత్వంలో సైబర్ క్రైమ్ టీమ్ ఈ ఆపరేషన్‌ను చేపట్టి నాలుగు కీలక నిందితులను పట్టుకున్నారు.
నిందితులు యూఐడీఏఐ వ్యవస్థలోని లొసుగులను ఉపయోగించి అక్రమంగా బయోమెట్రిక్ డేటా మార్పు చేసినట్టు వెల్లడించారు. వీరు బదాయూన్‌కు చెందిన ఆశిష్ కుమార్, ధర్మేందర్ సింగ్, రౌనక్ పాల్, అమ్రోహాకు చెందిన కాసిం హుస్సేన్‌గా గుర్తించారు. వీరంతా 20 ఏళ్ల వయస్సు వారే కావడం గమనార్హం. వారి పై ఆధార్ చట్టం, ఐటీ చట్టం, పాస్‌పోర్ట్ చట్టం కింద కేసులు నమోదు చేశారు.
ఈ ముఠా దేశ వ్యాప్తంగా 200–300 మంది రిటైలర్లతో నెట్‌వర్క్ ఏర్పాటు చేసి, పేరు, చిరునామా, పుట్టిన తేదీ, మొబైల్ నంబర్ మార్పులకు రూ.2,000–5,000 వసూలు చేసేది. విచారణలో ఇప్పటివరకు 1,500 ఆధార్ డేటాలు తారుమారు చేసినట్లు తెలిసింది. 400 పైగా ఫేక్ డాక్యుమెంట్లు, బయోమెట్రిక్ మార్పుల ఆధారాలు లభించాయి. అంతేకాకుండా రేషన్ కార్డుల డేటాను కూడా తారుమారు చేయాలన్న కుట్ర ఉన్నట్టు గుర్తించారు.
ఈ ముఠాలో ప్రధాన నిందితుడు ఆశిష్ కుమార్, బీటెక్ మధ్యలో ఆపి నకిలీ ఆధార్, పాస్‌పోర్ట్ సేవల పోర్టల్స్‌ను తయారుచేసి, నకిలీ పత్రాలను తయారుచేసేవాడు. క్లోన్ చేసిన వేలిముద్రలు, జియోఫెన్సింగ్ తప్పించేందుకు సాఫ్ట్‌వేర్ ఉపయోగించి అక్రమ లాగిన్లు చేసేవారు. సిలికాన్ వేలిముద్రలతో అసలు ఆపరేటర్ల స్థానం వదిలిపెట్టకుండా ఆధార్ డేటా మార్పులు చేసేవారు. డిసెంబర్ 2024 తర్వాత కఠినమైన ధృవీకరణ నిబంధనలను దాటి, పాస్‌పోర్ట్‌లను సైతం నకిలీగా సృష్టించినట్లు పోలీసులు గుర్తించారు