చైనాకు చెందిన కియాబెన్ అనే వ్యక్తి ఆన్‌లైన్ గేమ్‌ను నిజజీవితంతో ముడిపెట్టి, తనపై జరిగిన అవమానంపై కోర్టులో కేసు వేశాడు. ‘థ్రీ కింగ్‌డమ్స్ కిల్’ అనే ఆన్‌లైన్ గేమ్‌కు 15 సంవత్సరాలుగా అభిమానిగా ఉన్న అతడు, ఆటలో భాగంగా 4,800 సార్లకు పైగా చెంపదెబ్బలు తిన్నానని పేర్కొన్నాడు. అవి తన మనోభావాలను దెబ్బతీసాయని, అవమానంగా అనిపించిందని తెలిపాడు.
అతని ప్రకారం, తన అవతార్‌పై ప్రత్యర్థులు గుడ్లు, గడ్డి, పాదరక్షలు విసరడం వంటివి చెయ్యడం చూస్తూ, అవి నిజంగా తాను అనుభవించినట్టే అనిపించిందని వాపోయాడు. ఆ చర్యలు తన ఆత్మగౌరవాన్ని దిగజార్చాయని ఆరోపించాడు. వర్చువల్ ప్రపంచంలోని దూషణలు సైతం నిజ జీవితంలో మానసిక ఒత్తిడిని కలిగిస్తున్నాయని చెప్పాడు.
జిన్ హువాంగే అనే సంస్థ వెల్లడించిన వివరాల ప్రకారం, కియాబెన్ ఆ గేమ్‌లో అత్యున్నత ర్యాంకును కలిగి ఉన్నాడని పేర్కొంది. గేమ్‌లో గెలిచిన ప్రతిసారీ, ప్రత్యర్థులు తలపెట్టే అవమానకర చర్యలు మానసికంగా తట్టుకోలేనివిగా మారాయని అతడు విన్నవించాడు.
ఈ కేసు ఇప్పుడు చైనా వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. వర్చువల్ ప్రపంచంలో జరిగే ఘటనలు కూడా ఒక వ్యక్తికి మనోభావాల పరంగా ఎంతవరకు దెబ్బతీయగలవో ఈ ఘటన ఉదాహరణగా నిలుస్తోంది. ఆటల మానసిక ప్రభావంపై చర్చ మొదలైందని నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు.