ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్ సీజన్‌లో ముంబై ఇండియన్స్ స్టార్ ఆటగాడు రోహిత్ శర్మ తీవ్రంగా నిరాశపరుస్తున్నాడు. హిట్ మ్యాన్ అన్న పేరుకు తగ్గట్టుగా ప్రదర్శన ఇవ్వలేకపోతున్న రోహిత్ ఇప్పటివరకు మూడు మ్యాచ్‌ల్లో వరుసగా 0, 8, 13 పరుగులు మాత్రమే చేశాడు. జట్టుకు ఆరంభ ఓపెనర్‌గా ఉన్న రోహిత్ నుంచి అభిమానులు భారీ ఇన్నింగ్స్ ఆశిస్తుండగా, అతని తక్కువ స్కోర్లు అందరినీ కలవరపెడుతున్నాయి.
నిన్న లక్నోతో జరిగిన మ్యాచ్‌లో రోహిత్ శర్మ బరిలోకి దిగలేదు. టాస్ సమయంలో ముంబై కెప్టెన్ హార్దిక్ పాండ్యా మాట్లాడుతూ, రోహిత్ గాయంతో ఆటకు దూరమయ్యాడని ప్రకటించాడు. మ్యాచ్‌కు ముందు ప్రాక్టీస్ సమయంలో రోహిత్ మోకాలిపై బంతి తగిలిన దృశ్యం ఒక వీడియోలో స్పష్టంగా కనిపించింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
మ్యాచ్ అనంతరం ముంబై హెడ్ కోచ్ మాహెల జయవర్దనే స్పందిస్తూ, రోహిత్ మోకాలి వద్ద గాయపడ్డాడని, పూర్తిగా కోలుకునే వరకు విశ్రాంతి ఇవ్వాలని భావిస్తున్నట్టు తెలిపారు. గాయం తీవ్రత ఏమిటన్నది స్పష్టంగా చెప్పకపోయినా, రోహిత్ మరికొన్ని మ్యాచ్‌లకు దూరం అయ్యే అవకాశముందని సంకేతాలున్నాయి.
రోహిత్ పేలవ ప్రదర్శన నేపథ్యంలో మూడో మ్యాచ్‌లో అతన్ని ఇంపాక్ట్ ప్లేయర్‌గా తీసుకోవడం, తర్వాతి మ్యాచ్‌లో పూర్తిగా పక్కన పెట్టడం అభిమానుల్లో సందేహాలు రేపుతున్నాయి. ప్రస్తుతం గాయంతో ఉన్న రోహిత్ తదుపరి మ్యాచ్‌లో బరిలోకి దిగే అవకాశాలు కూడా సందేహాస్పదంగా ఉన్నాయి. రోహిత్ తిరిగి ఫిట్ అయి ఫామ్‌లోకి రావాలని అభిమానులు ఆశిస్తున్నారు.