పుట్టపర్తిలో కలెక్టరేట్ హాలులో నిర్వహించిన సమీక్ష సమావేశంలో జిల్లా కలెక్టర్ టీఎస్ చేతన్ అధ్యక్షతన పలు అంశాలపై కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ప్రతి నియోజకవర్గంలో తాగునీటి సమస్య తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని, దీనిలో భాగంగా కంట్రోల్ రూములు ఏర్పాటు చేయాలని సూచించారు. నీటి నాణ్యతపై నిరంతర పర్యవేక్షణ జరగాలని, పైప్లైన్లలో లీకేజీలు లేకుండా మరమ్మతులు చేయాలని ఆదేశించారు.
జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద పశువుల కోసం మినీ గోకులం, ఫారం పాండ్స్, నీటి తొట్టెల నిర్మాణం చేపట్టాలని అధికారులను ఆదేశించారు. రోడ్డు కనెక్టివిటీ ఉన్న ప్రాంతాలను గుర్తించి వేగంగా పనులు ప్రారంభించాలని సూచించారు. పారిశుధ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని డిపిఒను ఆదేశించారు.
పియం సూర్య ఘర్ పథకం అమలులో ప్రతి నియోజకవర్గంలో 10 వేల రూఫ్ టాప్ యూనిట్ల ఏర్పాటే లక్ష్యంగా ముందుకు సాగాలని చెప్పారు. ఎస్సీ, ఎస్టీ లబ్ధిదారులకు పూర్తిగా ఉచితంగా అందించనున్న ఈ పథకంపై విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని అన్నారు. బీసీలకు కూడా భారీ సబ్సిడీ కలిగించనున్నట్టు వెల్లడించారు.
అన్ని నియోజకవర్గాలకు ప్రత్యేక విజన్ ప్రణాళికలు రూపొందించేందుకు కమిటీలు ఏర్పాటు చేయాలని, భూగర్భజలాల స్థాయి, వ్యవసాయ వివరాలతో పాటు ఉద్యానవన అభివృద్ధిపై స్పష్టమైన ప్రణాళిక సిద్ధం చేయాలని కలెక్టర్ ఆదేశించారు. ఈ సమీక్ష సమావేశంలో జాయింట్ కలెక్టర్ అభిషేక్ కుమార్, ఆర్డీవోలు, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
