కాకినాడ జిల్లా తాళ్ళరేవు మండలం పటవల పంచాయతీలో ఉప సర్పంచ్ చెక్కపల్లి లక్ష్మణ్ అధ్యక్షతన రీ సర్వే గ్రామ సభ జరిగింది. ఈ సమావేశంలో తాసిల్దార్ పి. త్రినాధరావు పాల్గొని, రీ సర్వే ప్రాజెక్ట్ ప్రభుత్వానికి ఎంతో ప్రతిష్టాత్మకమైనదని చెప్పారు. అధికారులెవరు నిర్లక్ష్యం వహించినా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
గత 30 ఏళ్లుగా పటవల గ్రామంలో ఎన్సీసీ, అసైన్డ్ ల్యాండ్ లబ్ధిదారులకు పట్టాలు రాలేదని పేర్కొన్నారు. దీనిపై ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి పరిశీలించి అర్హులైన వారికి తప్పకుండా పట్టాలు ఇచ్చే విధంగా చర్యలు తీసుకుంటామని చెప్పారు. అలాగే ఆక్రమణదారులపై పీఓటీ చట్టం ప్రకారం కఠినంగా వ్యవహరించడం జరుగుతుందని వివరించారు.
ప్రభుత్వం చేపట్టిన రీ సర్వే పకడ్బందీగా, పారదర్శకంగా సాగాలన్నదే లక్ష్యమని, అందరూ సహకరించాలని, అధికారులు చిత్తశుద్ధితో పనిచేయాలని తాసిల్దార్ ఆదేశించారు. ఈ ప్రాజెక్ట్ ద్వారా భూముల పునర్విభజన, స్పష్టత, ఆధికారిక పట్టాదారు గుర్తింపు కలుగుతుందన్నారు.
సిపిఎం మండల కన్వీనర్ టేకుముడి ఈశ్వరరావు పలు సమస్యలు తాసిల్దార్ దృష్టికి తీసుకెళ్లారు. తాసిల్దార్ త్రినాధరావు, రెవిన్యూ సిబ్బంది నిజాయితీగా పనిచేస్తున్నారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ సిబ్బంది, ప్రజాప్రతినిధులు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
