శుక్రవారం పెబ్బేరు మండలంలోని కంచిరావుపల్లి గ్రామ రైతువేదికలో పిఎసిఎస్ ఐకెపి పీపీసీ నిర్వాహకులకు ధాన్యం కొనుగోలు పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొని, రైతులు ధాన్యం అమ్మేందుకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా కొనుగోలు కేంద్రాల్లో తగిన ఏర్పాట్లు చేయాలని సూచించారు. రైతుల కోసం తాగునీరు, కుర్చీలు, టెంట్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు.
ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ప్రతిరోజు రిజిస్టర్ నిర్వహించాల్సిన అవసరం ఉందని తెలిపారు. రైతులు ధాన్యం తీసుకువచ్చినప్పుడు తేమ శాతం నమోదు చేయాలని, సన్న రకం వరి ధాన్యాన్ని గుర్తించడంలో ఇంచార్జ్‌లు అవగాహన కలిగి ఉండాలని సూచించారు. ప్రభుత్వం సన్న వరికి ₹500 బోనస్ కల్పిస్తున్నందున ధాన్యాన్ని గుర్తించడంలో అప్రమత్తంగా వ్యవహరించాలని చెప్పారు.
డిజిటల్ గ్రేయిన్ కాలిబర్ మీటర్‌ను ఉపయోగించి ధాన్యాన్ని గుర్తించే విధానం నేర్చుకోవాలని, సన్న రకం, దొడ్డు రకం వరికి వేరువేరు కేంద్రాలను ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు. ధాన్యం కొనుగోలు చేసిన వెంటనే మిల్లుకు తరలించి ట్రక్ షీట్ తెప్పించుకోవాలని, రైతులకు నగదు చెల్లింపులు వేగంగా జరిగేలా చూడాలని ఆదేశించారు.
ధాన్యం సరైన రీతిలో విక్రయించే విధంగా రైతులకు మార్గనిర్దేశం చేశారు. సందేహాలుంటే ఏఈఓలను సంప్రదించాలని సూచించారు. శిక్షణలో పాల్గొన్న పీపీసీ నిర్వాహకులను కలెక్టర్ స్వయంగా పరీక్షించి వారికి అవగాహన ఎంతవరకు ఉందో తెలుసుకున్నారు.
