జోగులాంబ గద్వాల జిల్లా ధరూరు మండల కేంద్రంలో కొత్తగా నిర్మించనున్న పోలీస్ స్టేషన్కు తెలంగాణ రాష్ట్ర డైరెక్టర్ ఆఫ్ జనరల్ పోలీస్ జితేందర్ శుక్రవారం భూమి పూజ నిర్వహించారు. ఈ సందర్భంగా పోలీస్ అధికారులతో కలిసి ఆయన భూమి పూజ కార్యక్రమాన్ని పూర్తి చేశారు. ప్రజలకు మెరుగైన భద్రతను అందించేందుకు ఆధునిక పోలీస్ స్టేషన్ను నిర్మిస్తున్నట్టు తెలిపారు.
ఈ నిర్మాణానికి రాష్ట్ర బడ్జెట్ నిధుల నుండి రూ. 265 లక్షల రూపాయలు కేటాయించారని జితేందర్ వెల్లడించారు. మండల ప్రజలకు మరింత సౌకర్యంగా, సమర్థవంతంగా పోలీస్ సేవలు అందించేందుకు ఈ స్టేషన్ ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. పోలీస్ సిబ్బంది సౌకర్యాలను మెరుగుపరిచేలా అన్ని అవసరమైన వసతులు కల్పించనున్నామని చెప్పారు.
పోలీస్ స్టేషన్ నిర్మాణాన్ని ఒక సంవత్సరంలోపు పూర్తిచేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు. హౌసింగ్ కార్పొరేషన్ ఎండి, చైర్మన్, స్థానిక ఎమ్మెల్యే సహకారం అందించాలని కోరారు. మండల ప్రజల కోసం పోలీస్ సేవలను సమర్థంగా నిర్వహించేందుకు ఇది ముఖ్యమైన ముందడుగు అని అన్నారు.
ఈ కార్యక్రమంలో పోలీస్ అధికారులు, ప్రజాప్రతినిధులు, స్థానిక నాయకులు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు. మండల ప్రజలకు మెరుగైన భద్రత కల్పించేందుకు ప్రభుత్వం అనేక కీలక చర్యలు తీసుకుంటోందని తెలిపారు.
