లండన్ నుంచి ముంబైకి బయలుదేరిన వర్జిన్ అట్లాంటిక్ విమానం సాంకేతిక లోపం కారణంగా తుర్కియేలో అత్యవసరంగా ల్యాండ్ అయ్యింది. విమానం దియార్ బాకిర్ విమానాశ్రయంలో దిగింది. కానీ గంటలు గడుస్తున్నా ప్రయాణికులకు ప్రత్యామ్నాయ విమానం ఏర్పాటు చేయలేదు. దాదాపు 40 గంటలుగా ప్రయాణికులు విమానాశ్రయంలోనే గడుపుతున్నారు. కనీస వసతులు లేక తీవ్ర అసౌకర్యాన్ని అనుభవిస్తున్నారు.
ప్రయాణికులు చెబుతున్న వివరాల ప్రకారం 250 మందికి ఒక్క టాయిలెట్ మాత్రమే ఉండటం, చలిని తట్టుకునే దుప్పట్లు లేకపోవడం తీవ్ర అవస్థకు గురి చేసింది. వృద్ధులు, చిన్నారులు ఉండటంతో పరిస్థితి మరింత దయనీయంగా మారిందని చెప్పారు. తాము తినేందుకు, విశ్రాంతికి కూడా సరైన ఏర్పాట్లు లేవని వాపోతున్నారు. కుటుంబ సభ్యులు సోషల్ మీడియాలో విమాన సంస్థపై అసహనం వ్యక్తం చేస్తున్నారు.
ఈ నేపథ్యంలో వర్జిన్ అట్లాంటిక్ ఎయిర్ లైన్స్ ఓ ప్రకటన విడుదల చేసింది. ప్రయాణికుల భద్రతే తమకు మొదటి ప్రాధాన్యత అని తెలిపింది. సాంకేతిక లోపం తలెత్తడంతో విమానాన్ని తుర్కియేలో ల్యాండ్ చేయాల్సి వచ్చిందని వివరించింది. నిపుణుల బృందం విమానాన్ని పరిశీలిస్తోందని, శుక్రవారం మధ్యాహ్నం తిరిగి విమానం బయలుదేరే అవకాశం ఉందని తెలిపింది.
ప్రయాణికులకు హోటల్ వసతి, భోజన సదుపాయాలు కల్పించినట్లు సంస్థ వెల్లడించింది. అయినా ప్రయాణికులు విమానాశ్రయంలోనే ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. తమ ప్రయాణికుల అసౌకర్యాన్ని తాము అర్థం చేసుకుంటున్నామని, వీలైనంత త్వరగా వారిని ముంబైకు చేర్చేందుకు ప్రత్యామ్నాయ మార్గాలు అన్వేషిస్తున్నామని సంస్థ తెలిపింది.