కర్నూలు జిల్లా కోసిగి మండలం వందగల్లు గ్రామంలో దురదృష్టకర సంఘటన చోటుచేసుకుంది. లంక నాగలక్ష్మి – ఆంజనేయులు దంపతుల కూతురు శ్రీదేవి (4) ఆదివారం ఉదయం తమ ఇంటి మిద్దెపై నుంచి ప్రమాదవశాత్తు జారి పడింది.
అప్రమత్తమైన కుటుంబ సభ్యులు తీవ్ర గాయాలతో ఉన్న చిన్నారిని వెంటనే కోసిగి ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. అయితే, అప్పటికే చిన్నారి తీవ్రంగా గాయపడడంతో వైద్యులు ఆమెను పరీక్షించి మృతి చెందినట్లు ధృవీకరించారు.
కూతురు మృతితో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరయ్యారు. వారి రోదనలు చూసిన గ్రామస్థులు సంతాపం వ్యక్తం చేశారు. చిన్నారిని కోల్పోయిన కుటుంబానికి గ్రామస్థులు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
ఈ ఘటనతో గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి. తొలివిడుతలోనే మిద్దెల పైపులు, గోడలు భద్రంగా నిర్మించాలని గ్రామ ప్రజలు చర్చించుకుంటున్నారు.

 
				 
				
			 
				
			 
				
			