సూపర్ స్టార్ మహేశ్ బాబు తన కూతురు సితారతో కలిసి నటించిన కొత్త యాడ్ ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. ఈ యాడ్‌లో తండ్రీకూతుళ్లు స్టైలిష్ లుక్స్ లో కనిపిస్తూ అభిమానులను ఆకట్టుకుంటున్నారు. షాపింగ్ సంతృప్తికరంగా జరిగినట్లు మహేశ్ చెప్పగా, సితార చిలిపిగా స్పందిస్తూ ఓ డ్రెస్ ఆయనపై విసిరేస్తుంది. అదే పద్దతిలో మహేశ్ కూడా తనపై బట్టలు విసిరి తండ్రీకూతురు ఫ్యాషన్ కాంపిటీషన్ మోడ్లో సందడి చేశారు.
ఈ యాడ్‌లో మహేశ్ బాబు గడ్డంతో ఉన్న క్లాసిక్ లుక్‌లో కనిపిస్తే, సితార చిరునవ్వులతో ఎంతో క్యూట్‌గా మెరిసిపోయింది. సోషల్ మీడియాలో ఈ యాడ్‌పై విపరీతమైన స్పందన వస్తోంది. తండ్రీకూతుళ్ల మధ్య కెమిస్ట్రీ అద్భుతంగా ఉందని నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. వారి ముద్దుగుమ్మ సితార మరింత అందంగా ఎదుగుతోందని, నటనలో కూడా పట్టు సాధిస్తోందని కామెంట్స్ చేస్తున్నారు.
మహేశ్ బాబు సినిమాల విషయానికి వస్తే, ప్రస్తుతం ఆయన ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వంలో నటిస్తున్నారు. ఈ సినిమా ‘SSMB29’ వర్కింగ్ టైటిల్‌తో రూపొందుతోంది. ప్రియాంక చోప్రా ఈ సినిమాలో కథానాయికగా నటిస్తుండగా, పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్రలో కనిపించనున్నారు. ఈ భారీ యాక్షన్ అడ్వెంచర్‌ను కేఎల్. నారాయణ నిర్మిస్తున్నారు.
ఈ సినిమా కథను ప్రముఖ రచయిత విజయేంద్ర ప్రసాద్ సిద్ధం చేశారు. హాలీవుడ్ టెక్నీషియన్లు కూడా ఇందులో పనిచేస్తుండటంతో సినిమాపై అంచనాలు పెరిగిపోయాయి. రాజమౌళి స్టైల్‌లో పాన్ వరల్డ్ లెవెల్‌లో తెరకెక్కుతున్న ఈ చిత్రం, మహేశ్ బాబు కెరీర్‌లో ఒక మైలురాయిగా నిలుస్తుందని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు.