రేపటి నుంచి ఐపీఎల్ 18వ సీజన్ గ్రాండ్‌గా ప్రారంభం కానుంది. ఈడెన్ గార్డెన్స్ వేదికగా కోల్‌కతా నైట్ రైడర్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య తొలి మ్యాచ్ జరగనుంది. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ ఆటగాడు సురేశ్ రైనా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఐపీఎల్‌లో 500 పరుగులు సాధించిన ఆటగాడికి భారత జట్టులో చోటు దక్కే అవకాశముందన్నారు.
ఆయన మాట్లాడుతూ, యంగ్ ప్లేయర్లలో తిలక్ వర్మ, యశస్వి జైస్వాల్, రింకూ సింగ్ తన అభిమాన ఆటగాళ్లని చెప్పారు. ప్రస్తుతం ఐపీఎల్ ద్వారా యువ క్రికెటర్లు అద్భుత ప్రతిభ కనబరుస్తున్నారని, అంతర్జాతీయ క్రికెట్‌కు కొత్త ఆటగాళ్లు మంచి టాలెంట్‌తో వస్తున్నారని పేర్కొన్నారు. గతంలోనూ అనేక మంది ఐపీఎల్‌లో రాణించి భారత జట్టులో స్థానం సంపాదించుకున్నారని రైనా గుర్తుచేశారు.
2024 టీ20 వరల్డ్‌కప్ గెలిచిన భారత జట్టు, ఈ ఏడాది ఛాంపియన్స్ ట్రోఫీ కూడా గెలవడం గొప్ప విషయమని అన్నారు. వరుసగా రెండు ఐసీసీ టోర్నీలు గెలుచుకోవడం సాధారణ విషయం కాదని, భారత జట్టు ఈ విజయాలను మరింత విశ్వాసంతో ముందుకు తీసుకెళ్లాలని సూచించారు. యువ క్రికెటర్లు వర్తమానంలో ఉండి తమ ఆటపై దృష్టి పెడితే అవకాశాలు తమంతట తాము వస్తాయని సూచించారు.
ఐపీఎల్‌లో ఒక సీజన్‌లో 500 పరుగులు చేయగలిగితే ఆటగాడికి జాతీయ జట్టులో చోటు దాదాపు ఖాయమని రైనా అభిప్రాయపడ్డాడు. ఐపీఎల్ వేదికగా నిలకడగా రాణిస్తే వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం ఉండదని అన్నారు. క్రికెట్‌లో రైనా చేసిన విశేష సేవలను గుర్తు చేసుకుంటూ అభిమానులు ఆయన వ్యాఖ్యలపై ఆసక్తి కనబరుస్తున్నారు.