తెలంగాణ రాష్ట్రంలో పదో తరగతి పరీక్షలు ఈరోజు ప్రారంభమయ్యాయి. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు ముందస్తు ఏర్పాట్లు చేశారు. ప్రతి పరీక్షా కేంద్రంలో డీఈఓ, ఎంఈఓ, తహసీల్దార్‌ల ఫోన్ నంబర్లు ప్రదర్శించబడటంతో, ఏదైనా సమస్యలుంటే వెంటనే సమాచారం అందించవచ్చని అధికారులు తెలిపారు.
ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు పరీక్షలు జరుగుతాయి. పరీక్ష ప్రారంభమైన 5 నిమిషాల వరకు విద్యార్థులను కేంద్రాల్లోకి అనుమతిస్తారు. ఆలస్యంగా వచ్చే విద్యార్థులను ప్రవేశపెట్టమని అధికారులు స్పష్టం చేశారు. ప్రశాంత వాతావరణంలో పరీక్షలు నిర్వహించేందుకు పటిష్టమైన భద్రతా చర్యలు తీసుకున్నారు.
ఈసారి రాష్ట్రవ్యాప్తంగా 2,650 పరీక్షా కేంద్రాల్లో 5,09,403 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరవుతున్నారు. పరీక్ష కేంద్రాల్లో భద్రతను కట్టుదిట్టం చేయడంతో పాటు, విద్యార్థుల తనిఖీలు నిర్వహించి కేంద్రాల్లోకి అనుమతించారు. పరీక్షల నిర్వహణపై విద్యాశాఖ ప్రత్యేకంగా నిఘా పెట్టింది.
ఈ ఏడాది 24 పేజీల బుక్‌లెట్ విధానం ప్రవేశపెట్టడం విశేషం. విద్యార్థులకు సమాధానాలు రాయడానికి తగినంత స్థలం అందుబాటులో ఉండేలా ఈ కొత్త విధానాన్ని అమలు చేస్తున్నారు. ఏప్రిల్ 4వ తేదీతో పదో తరగతి పరీక్షలు ముగియనున్నాయి.