సుదీర్ఘ నిరీక్షణ అనంతరం భారత సంతతి వ్యోమగామి సునీతా విలియమ్స్ భూమికి చేరుకున్నారు. ఆమెతో పాటు బచ్ విల్మోర్, నిక్ హాగ్, రోస్‌కోమోస్ కాస్మోనాట్ అలెక్సాండర్ గోర్బనోవ్ కూడా క్రూ డ్రాగన్ క్యాప్సూల్‌లో ఉన్నారు. ఈ తెల్లవారుజాము 3.27 గంటలకు క్యాప్సూల్ విజయవంతంగా ఫ్లోరిడా సముద్ర తీరంలో ల్యాండ్ అయింది.
క్యాప్సూల్ సముద్రంలో ల్యాండ్ అయిన వెంటనే దాని చుట్టూ డాల్ఫిన్లు ఈదడం అద్భుతమైన దృశ్యంగా మారింది. నాసా సిబ్బంది వ్యోమనౌకను బోట్‌పైకి ఎక్కించేందుకు ప్రయత్నిస్తున్న సమయంలో, డాల్ఫిన్లు వాటి ప్రత్యేకమైన తీరుతో క్యాప్సూల్ చుట్టూ తిరుగుతూ స్వాగతం పలికినట్లు కనిపించాయి.
అనంతరం క్యాప్సూల్‌ను ఒడ్డుకు చేర్చి, అందులోని వ్యోమగాములను బయటకు తీసారు. వారి ఆరోగ్య పరిస్థితిని నిర్ధారించేందుకు నాసా వైద్య బృందం ప్రాథమిక పరీక్షలు నిర్వహించింది. అనంతరం వారిని హ్యూస్టన్‌లోని జాన్సన్ స్పేస్ సెంటర్‌కు తరలించి, అక్కడ 45 రోజులపాటు పునరావాసంలో ఉంచనున్నారు.
సునీతా విలియమ్స్ రాక ప్రపంచవ్యాప్తంగా శాస్త్రవేత్తలు, అభిమానులను ఆకట్టుకుంది. అంతరిక్ష పరిశోధనలో భారత సంతతి వ్యక్తిగా ఆమె ఘనత చాటుకున్నారు. డాల్ఫిన్ల వినూత్న స్వాగతం ఈ ప్రయాణాన్ని మరింత ప్రత్యేకంగా మార్చింది.
