బీజేపీ శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డిని రోడ్లపై తిప్పారంటూ బీజేపీ ఎమ్మెల్యేలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అసెంబ్లీ ప్రాంగణంలో నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. మహేశ్వర్ రెడ్డితో పాటు ఎమ్మెల్యేలు పాయల్ శంకర్, పాల్వాయి హరీశ్, ధన్‌పాల్ సూర్యనారాయణ తదితరులు ఈ నిరసనలో పాల్గొన్నారు.
మంగళవారం బీజేవైఎం ఆధ్వర్యంలో చేపట్టిన అసెంబ్లీ ముట్టడి కార్యక్రమంలో మహేశ్వర్ రెడ్డి పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో, పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకుని అసెంబ్లీ వద్దకు తీసుకురాగా, ఆయనకు అనుమతి లేకుండా నగరమంతా చక్కర్లు తిప్పించినట్లు బీజేపీ ఆరోపించింది. ఇది ప్రజాస్వామ్యానికి ముప్పుగా మారిందని ఆ పార్టీ నేతలు విమర్శించారు.
బీజేపీ ‘ఎక్స్’ వేదికగా ఈ ఘటనపై తీవ్ర స్థాయిలో స్పందించింది. ప్రజాప్రతినిధుల గొంతు నొక్కాలని చూస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం, తమ పాలనా వైఫల్యాలను ఎండగట్టడం భరించలేక బీజేపీ ఎమ్మెల్యేలను బెదిరించే పనిలో పడిందని ఆరోపించింది. ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చలేకపోతున్న సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం విఫలమైందని విమర్శించింది.
అసెంబ్లీలో బీజేపీ ఎమ్మెల్యేలకు మాట్లాడే అవకాశం లేకుండా చేస్తే తమపై వ్యతిరేకత పోతుందని కాంగ్రెస్ భావిస్తోందని బీజేపీ ఎద్దేవా చేసింది. ఇలాంటి బెదిరింపులకు తాము భయపడబోమని, ప్రజల పక్షాన పోరాటం కొనసాగుతుందని మహేశ్వర్ రెడ్డి స్పష్టం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాస్వామ్య విలువలను గౌరవించాలని బీజేపీ డిమాండ్ చేసింది.