హైదరాబాద్ చుట్టూ నిర్మించనున్న రీజనల్ రింగ్ రోడ్డు(RRR)పై తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కీలక ప్రకటన చేశారు. కేంద్ర రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరితో ఈ ప్రాజెక్టు గురించి తాను చర్చలు జరిపానని వెల్లడించారు. శాసనమండలిలో మాట్లాడిన ఆయన, ఆర్ఆర్ఆర్ దక్షిణ భాగం అలైన్‌మెంట్ పూర్తిచేసి కేంద్రానికి పంపనున్నట్లు తెలిపారు. ఈ ప్రాజెక్టు పూర్తయితే హైదరాబాద్ నగర రూపురేఖలు మారిపోతాయని వ్యాఖ్యానించారు.
రెండు నెలల్లో ఆర్ఆర్ఆర్ పనులు ప్రారంభమయ్యేలా చర్యలు తీసుకోవాలని గడ్కరీ హామీ ఇచ్చారని కోమటిరెడ్డి తెలిపారు. మూడున్నర నుంచి నాలుగేళ్లలో పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు. రాష్ట్ర అభివృద్ధికి తాము కట్టుబడి ఉన్నామని, బీఆర్ఎస్ నేతల మాదిరి రోడ్లను అమ్ముకునే అలవాటు తమకు లేదని ఆయన స్పష్టం చేశారు.
ఆర్ఆర్ఆర్ నిర్మాణంలో భూసేకరణ కీలక అంశమని, ప్రజలు సహకరించాలని మంత్రి కోరారు. భూముల కోసం మార్కెట్ రేటుకు అనుగుణంగా నష్టపరిహారం అందజేస్తామని హామీ ఇచ్చారు. భూసేకరణలో జాప్యం లేకుండా చూడాలని అధికారులను ఆదేశించినట్లు తెలిపారు. అభివృద్ధిని అడ్డుకునేలా అధికారులపై దాడులు చేయొద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
హైదరాబాద్ మెట్రో, రోడ్ల విస్తరణతోపాటు, ఆర్ఆర్ఆర్ ప్రాజెక్టు పూర్తైతే నగర రవాణా వ్యవస్థ మరింత మెరుగుపడుతుందని మంత్రి అన్నారు. ఈ రోడ్డు ద్వారా హైదరాబాద్‌కు వచ్చే ట్రాఫిక్ ఒత్తిడి తగ్గుతుందని, పక్క రాష్ట్రాల నుంచి వచ్చే వాహనాలకు ప్రత్యామ్నాయ మార్గం లభిస్తుందని వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి ప్రాజెక్టులను వేగంగా అమలు చేస్తుందని పేర్కొన్నారు.