చైనా సైన్యంలో మరో కీలకమైన పరిణామం చోటు చేసుకుంది. సెంట్రల్ మిలిటరీ కమిషన్ వైస్ ఛైర్మన్ హి వైడాంగ్ అరెస్టు వార్త తీవ్ర చర్చనీయాంశంగా మారింది. సైనిక సమాచారం లీక్ కేసులో ఆయనపై ఆరోపణలు ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో, చైనా అధికారిక వర్గాలు ఆయనపై దర్యాప్తు ప్రారంభించాయి. ఈ క్రమంలో హి వైడాంగ్ ను అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. అంతేకాకుండా, ఫుజియాన్ లో విధులు నిర్వహిస్తున్న మరికొందరు సీనియర్ జనరల్స్ ను కూడా అరెస్టు చేసినట్లు ప్రచారం జరుగుతోంది.
చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ సైన్యంలో సంస్కరణలు చేపట్టే క్రమంలో కీలక నేతలను పదవి నుంచి తొలగించడమే కాకుండా, అరెస్టులకు కూడా పాల్పడుతున్నారు. గతంలో కూడా నాన్‌జింగ్ మిలిటరీ రీజియన్‌లో జనరల్ లాజిస్టిక్స్ అధిపతిగా పనిచేసిన ఝావో కేషిని అరెస్టు చేశారు. అంతకుముందు, చైనా రక్షణ మంత్రిని కూడా అనూహ్యంగా తొలగించారు. ఇప్పుడు హి వైడాంగ్ అరెస్టుతో చైనా సైనిక వ్యవస్థలో తీవ్రమైన మార్పులు జరుగుతున్నాయి.
సెంట్రల్ మిలిటరీ కమిషన్ చైర్మన్‌గా స్వయంగా జిన్ పింగ్ వ్యవహరిస్తున్నారు. అటువంటి కమిషన్ వైస్ ఛైర్మన్‌ను అరెస్టు చేయడం చాలా ప్రాధాన్యత కలిగిన పరిణామంగా భావించబడుతోంది. హి వైడాంగ్‌ను అధ్యక్షుడికి అత్యంత సన్నిహితుడిగా చూస్తారు. అందుకే, ఆయన అరెస్టు వెనుక రాజకీయ కారణాలూ ఉన్నాయా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. చైనా ప్రభుత్వ వ్యవస్థలో అంతర్గత టెన్షన్ మరింతగా పెరుగుతోందని విశ్లేషకులు చెబుతున్నారు.
ఈ అరెస్టులు చైనా మిలిటరీలో పెద్దఎత్తున మార్పులకు దారితీసే అవకాశముంది. గతంలో కూడా పలు సీనియర్ మిలిటరీ అధికారులను తొలగించారు. మియావో లి అనే సీనియర్ మిలిటరీ అధికారి అరెస్టు ఘటన ఇప్పటికీ చర్చనీయాంశంగా ఉంది. హి వైడాంగ్ అరెస్టుతో పాటు, మరికొందరు జనరల్స్‌పై కూడా చర్యలు తీసుకునే అవకాశం ఉందని సమాచారం. మొత్తం మీద, చైనా సైన్యంలో పెరుగుతున్న అంతర్గత గందరగోళం జాతీయ, అంతర్జాతీయ రాజకీయాల్లోనూ ప్రభావం చూపేలా ఉంది.