జమ్మూలోని ప్రముఖ వైష్ణోదేవి ఆలయంలో భద్రతా వైఫల్యం బయటపడింది. ఓ మహిళ భద్రతా సిబ్బందిని కళ్లుగప్పి తుపాకీతో ఆలయంలోకి ప్రవేశించిందని తెలిసింది. ఈ ఘటన ఈ నెల 15న జరిగినప్పటికీ ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. భక్తుల రద్దీ ఎక్కువగా ఉండే సమయంలో ఈ ఘటన చోటుచేసుకోవడం భయాందోళనకు గురిచేసింది.
ఆమె వద్ద తుపాకీని గుర్తించిన భద్రతా సిబ్బంది వెంటనే అప్రమత్తమై ఆమెను అదుపులోకి తీసుకుని ఆయుధాన్ని స్వాధీనం చేసుకున్నారు. విచారణలో, ఆమె ఢిల్లీ పోలీస్ స్టేషన్లో పనిచేస్తున్న జ్యోతి గుప్తా అని పోలీసులు గుర్తించారు. గడువు ముగిసిన లైసెన్స్‌డ్ తుపాకీని ఆమె ఆలయంలోకి తీసుకురావడం చట్ట విరుద్ధమని స్పష్టం చేశారు.
ఘటన ఆలస్యంగా వెలుగు చూసినప్పటికీ, భద్రతా సిబ్బంది నిర్లక్ష్యంపై భక్తుల నుంచి తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఆలయ ప్రవేశ ద్వారంలో భద్రతా తనిఖీలు కఠినంగా ఉంటాయని భావించిన భక్తులు, ఇలా ఒకరు తుపాకీతో ఎలా ప్రవేశించగలిగారని ప్రశ్నిస్తున్నారు.
పోలీసులు ఈ ఘటనపై దర్యాప్తు కొనసాగిస్తున్నారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా భద్రతా చర్యలను మరింత కట్టుదిట్టం చేయాలని భక్తులు కోరుతున్నారు. ఆలయ భద్రతను మరింత బలోపేతం చేయాలని, భద్రతా లోపాలకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.