తెలంగాణ అసెంబ్లీలో బీసీ బిల్లు ఆమోదించడంపై షాద్ నగర్ ఎమ్మెల్యే, రాష్ట్ర ప్రభుత్వ సంస్థల చైర్మన్ వీర్లపల్లి శంకర్ హర్షం వ్యక్తం చేశారు. షాద్ నగర్ క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఈ బిల్లుతో బీసీలకు విద్య, ఉపాధి, రాజకీయాల్లో అవకాశాలు పెరుగుతాయని చెప్పారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, బీసీ మంత్రి పొన్నం ప్రభాకర్, సహకరించిన అఖిలపక్ష నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు.
బీసీ రిజర్వేషన్ల సాధన కోసం అన్ని రాజకీయ పార్టీలను కలుపుకొని ఢిల్లీకి వెళ్లేలా ప్రణాళిక సిద్ధం చేయాలని ఎమ్మెల్యే శంకర్ పిలుపునిచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం బీసీల అభ్యున్నతికి కృషి చేస్తుందని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో 42% రిజర్వేషన్లు సాధించేందుకు ప్రయత్నిస్తామని తెలిపారు. తమిళనాడు తరహాలో రిజర్వేషన్లను అమలు చేయాలని కోరారు.
షాద్ నగర్ నియోజకవర్గ సమస్యలను అసెంబ్లీలో ప్రస్తావించనున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. ముఖ్యంగా కంసాన్పల్లి పశు వీర్య కేంద్రం అభివృద్ధి, చటాన్ పల్లి రైల్వే ఓవర్ బ్రిడ్జి నిర్మాణం, లక్ష్మీదేవి పల్లి రిజర్వాయర్ నిర్మాణానికి సంబంధించిన అంశాలను ప్రభుత్వ దృష్టికి తీసుకువెళతామని అన్నారు.
ఈ సమావేశంలో మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ బాబర్ ఖాన్, మండల పార్టీ అధ్యక్షులు కృష్ణారెడ్డి, మున్సిపల్ అధ్యక్షుడు సుదర్శన్ గౌడ్, ఓబిసి చైర్మన్ చంద్రశేఖర్, తదితరులు పాల్గొన్నారు. బీసీ బిల్లుపై కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని అభినందిస్తూ, తాము పూర్తి మద్దతు తెలుపుతున్నామని అన్నారు.