విజయనగరం జిల్లా వివిధ మండలాలకు చెందిన ప్రజలు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పార్టీ కార్యాలయం అశోక్ బంగ్లాలో పార్లమెంట్ పార్టీ అధ్యక్షుడు కిమిడి నాగార్జునను కలిశారు. గ్రామాలలో ఎదుర్కొంటున్న సమస్యలను వినతిపత్రాల రూపంలో సమర్పించారు. అనంతరం ఈ సమస్యలపై కిమిడి నాగార్జున స్పందించి, పరిష్కారం కోసం కలెక్టర్ గ్రీవెన్స్ సెల్‌లో విజ్ఞప్తి చేశారు.
ఈ కార్యక్రమంలో పూసపాటిరేగ మండలంలో ముస్లిం వర్గానికి శాశ్వత ఇళ్ల పట్టాలు మంజూరు, చౌడువాడ పంచాయితీలో 3 ఫేస్ విద్యుత్ అందుబాటులోకి తేవడం, నెల్లిమర్ల మండలంలో జగనన్న కాలనీలో అనర్హులకు మంజూరైన ఇళ్ల పట్టాలను సమీక్షించడం, ఆక్రమణలను తొలగించడం వంటి అంశాలపై అధికారులను ఆదేశించాలని కోరారు.
అలాగే, దన్నానపేట గ్రామానికి చెందిన సత్యవతికి చెందిన భూమి దురాక్రమణకు గురైందని, దాన్ని తిరిగి అందజేయాలని డిమాండ్ చేశారు. పూసపాటిరేగ మండలం కిలుగుపేట ఎస్సీ కాలనీలో ప్రభుత్వ మంచినీటి బోరుబావులకు భరోసా కల్పించి, అక్రమంగా తవ్విన వ్యవసాయ బోర్లను తొలగించాలని కోరారు.
ఈ కార్యక్రమంలో పార్టీ ముఖ్య నాయకులు, మండలాధికారులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. ప్రజా సమస్యల పరిష్కారానికి టీడీపీ ఎప్పుడూ ప్రజలతో ఉంటుందని, ప్రజల అభ్యున్నతి కోసం నిరంతరం కృషి చేస్తామని కిమిడి నాగార్జున తెలిపారు. సమస్యలపై ప్రభుత్వం వెంటనే స్పందించకపోతే మరింత దృఢంగా పోరాటం చేస్తామని హితవు పలికారు.

 
				 
				
			 
				
			 
				
			