జనసేన అధ్యక్షుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలపై ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తీవ్రంగా స్పందించారు. ఇటీవల జనసేన ఆవిర్భావ సభలో చేసిన ప్రకటనల పట్ల ఆమె విమర్శలు చేశారు. పవన్ కల్యాణ్ చేగువేరా, గద్దర్ సిద్ధాంతాలను వదిలేసి, ఇప్పుడు మోదీ, అమిత్ షా మార్గంలో నడుస్తున్నారని ఆమె ఆరోపించారు.
పవన్ కల్యాణ్ వ్యాఖ్యలు చూస్తుంటే, ఆయన ఆర్ఎస్ఎస్ భావజాలాన్ని పూర్తిగా అంగీకరించినట్టు కనిపిస్తోందని షర్మిల అన్నారు. జనసేనను “ఆంధ్ర మత సేన”గా మార్చారని విమర్శించారు. జనం కోసం పుట్టిన పార్టీని మత ప్రాతిపదికన నడిపించడం దారుణమని ఆమె అభిప్రాయపడ్డారు.
ఆంధ్రప్రదేశ్ లాంటి మతసౌహార్ధ రాష్ట్రంలో విభజించు పాలించు ధోరణిని అవలంబించడం విచారకరమని షర్మిల అన్నారు. పార్టీ పెట్టి 11 ఏళ్లైన తర్వాత కూడా జనసేన మతపరమైన విధానాలను అవలంభించడం తగదని సూచించారు. మత సామరస్యాన్ని కాపాడాలని, ఓ ముఖ్యమైన పదవిలో ఉన్న వ్యక్తిగా పవన్ కల్యాణ్ బాధ్యతగా వ్యవహరించాలని అన్నారు.
కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ స్వాతంత్ర్య సమరయోధుల ఆశయాలను పాటిస్తుందని, పవన్ మాత్రం బీజేపీ మతపరమైన విధానాలను అనుసరించడం దురదృష్టకరమని ఆమె విమర్శించారు. ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన పవన్ కల్యాణ్ ఇప్పటికైనా మతపరమైన భావజాలం నుంచి బయటపడాలని హితవు పలికారు.
