రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సతీమణి, ఎన్టీఆర్ ట్రస్ట్ చైర్మన్ నారా భువనేశ్వరి కుప్పంలో పర్యటించారు. హైదరాబాద్ నుంచి బెంగళూరు విమానాశ్రయం చేరుకొని, అక్కడినుండి రోడ్డుమార్గంలో శాంతిపురం మండలం రాళ్లబుదుగురు గ్రామానికి చేరుకున్నారు. కోదండరామస్వామి బ్రహ్మోత్సవాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించి, భక్తులతో కలిసి రథాన్ని లాగారు. ఆలయ పండితులు వేద మంత్రాలతో స్వాగతం పలికి తీర్థ ప్రసాదాలు అందజేశారు.
కుప్పం నియోజకవర్గానికి చేరుకున్న భువనేశ్వరి కి పార్టీ కార్యకర్తలు, నాయకులు, అభిమానులు ఘన స్వాగతం పలికారు. అనంతరం కదిరిముతనపల్లి గ్రామానికి వెళ్లి కురభ కులస్తుల ఆరాధ్యదైవం సిద్ధేశ్వర స్వామి పెద్ద దేవర కార్యక్రమంలో పాల్గొన్నారు. 12 ఏళ్లకోసారి జరిగే ఈ మహోత్సవానికి కర్ణాటక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ నుంచి వేలాది మంది భక్తులు తరలివచ్చారు.
ఈ ఏడాది పెద్ద దేవర ఉత్సవంలో 5 లక్షల మందికి పైగా భక్తులు హాజరయ్యారని అంచనా వేయబడింది. కురభ కులస్తుల విశ్వాసానికి ప్రతీకగా ఈ దేవర ఉత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు. నారా భువనేశ్వరి మాట్లాడుతూ, ఇంతటి మహోత్సవంలో పాల్గొనడం ఎంతో ఆనందంగా ఉందని, ఈ ఉత్సవం ద్వారా భక్తుల సమైక్యత మరింత బలపడుతుందన్నారు.
భువనేశ్వరి పర్యటన కుప్పం ప్రాంతంలో భక్తులలో ఆధ్యాత్మిక శోభను నింపింది. కోదండరామస్వామి రథోత్సవం, పెద్ద దేవర మహోత్సవం ఈ ఏడాది అత్యంత వైభవంగా జరిగినవని భక్తులు ఆనందం వ్యక్తం చేశారు. కుప్పం ప్రాంతంలో ఇంత భారీ భక్తజనం చేరడం అరుదని, భక్తుల విశ్వాసం నిలబెట్టేలా భవ్యమైన ఉత్సవాలు జరిగాయన్నారు.

 
				 
				
			 
				
			 
				
			