సినీ నటుడు, రచయిత పోసాని కృష్ణమురళి సీఐడీ పీటీ వారెంట్ రద్దు చేసేందుకు చేసిన ప్రయత్నం విఫలమైంది. సీఐడీ చర్యలను సవాల్ చేస్తూ హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేసిన ఆయనకు ఊరట లభించలేదు. హైకోర్టు ఈ పిటిషన్‌ను కొట్టివేస్తూ, సీఐడీ చర్యలకు బ్రేక్ వేయలేమని తేల్చిచెప్పింది.
ఇప్పటికే కర్నూలులో పోసానిని పీటీ వారెంట్ ఆధారంగా అదుపులోకి తీసుకున్నామని పబ్లిక్ ప్రాసిక్యూటర్ కోర్టుకు వివరించారు. ఆయన్ని మంగళగిరి మేజిస్ట్రేట్ ఎదుట హాజరుపరచేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నట్లు కోర్టుకు తెలియజేశారు. ఈ నేపథ్యంలో, పోసాని పిటిషన్ అవసరం లేదని హైకోర్టు పేర్కొంది.
ఇరువైపులా వాదనలు విన్న హైకోర్టు న్యాయమూర్తి, పోసాని అభ్యర్థనను తోసిపుచ్చారు. దీంతో, ఆయనకు తాత్కాలిక ఊరట దక్కలేదు. పీటీ వారెంట్ ప్రకారం విచారణ కొనసాగుతుందని స్పష్టత ఇచ్చారు. ఈ తీర్పుతో పోసాని తీవ్ర నిరాశకు గురయ్యారు.
ఈ పరిణామాలు రాజకీయంగా ఆసక్తికరంగా మారాయి. టీడీపీ, జనసేన వర్గాలు పోసాని వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేస్తుండగా, వైసీపీ మద్దతుదారులు ఈ కేసును రాజకీయ కక్షసాధిగా చూస్తున్నారు. హైకోర్టు తీర్పు అనంతరం, పోసాని విచారణ తదుపరి దశ ఎలాంటి మలుపులు తిరుగుతుందన్నది ఉత్కంఠగా మారింది.