ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇవాళ ప్రకాశం జిల్లా మార్కాపురంలో పర్యటించారు. ఈ సందర్భంగా డ్వాక్రా మహిళలు ఏర్పాటు చేసిన స్టాళ్లను సందర్శించి, వారు తయారుచేసిన వస్తువులను ఆసక్తిగా పరిశీలించారు. స్వయం సహాయ సమూహాల మహిళలు ఉత్పత్తులను మార్కెట్ చేయడానికి ప్రభుత్వం అందిస్తున్న సహాయాన్ని చంద్రబాబు ప్రశంసించారు.
ఓ చీరల స్టాల్ వద్ద చంద్రబాబు తన సతీమణి నారా భువనేశ్వరి కోసం ప్రత్యేకంగా ఒక పట్టుచీర కొనుగోలు చేశారు. “ఎంతకు అమ్ముతున్నావమ్మా ఈ చీర?” అంటూ మహిళను ప్రశ్నించగా, ఆమె రూ.26,400 అని చెప్పింది. చివరకు చంద్రబాబు ఆ చీరను రూ.25,000కి బేరం ఆడి కొనుగోలు చేశారు. ఈ ఘటన స్టాల్ వద్ద ఆసక్తికరంగా మారింది.
అలాగే, చంద్రబాబు మంగళగిరి పట్టుచీరలు, షర్టులు, పంచె, కండువా సెట్‌ను కూడా పరిశీలించారు. వ్యాపారం ఎలా సాగుతోంది? అమ్మకాలు ఎలా ఉన్నాయి? అంటూ మహిళలతో మాట్లాడారు. పర్యావరణ హిత విధానంలో గుడ్డ సంచులు వాడటాన్ని అభినందించి, డ్వాక్రా మహిళలు చేస్తున్న కృషిని ప్రశంసించారు.
ఈ పర్యటనలో చంద్రబాబు మహిళా స్వయం సహాయ సమూహాలకు మరింత ప్రోత్సాహం అందించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. డ్వాక్రా మహిళలు స్వయం సాధికారత సాధించి, ఆర్థికంగా ఎదగడంలో ప్రభుత్వం పూర్తి మద్దతుగా ఉంటుందని హామీ ఇచ్చారు. మహిళా సాధికారత కోసం మరిన్ని ఉపాధి అవకాశాలు అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు.

 
				 
				
			 
				
			 
				
			