తెలంగాణలో బీజేపీ బలపడుతుందని, రాబోయే రోజుల్లో రాష్ట్రంలో అధికారంలోకి రావడం ఖాయమని చిన్న శంకరంపేట మండల బీజేపీ అధ్యక్షులు పోగుల రాజు తెలిపారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థుల గెలుపు ప్రజల నమ్మకానికి నిదర్శనమని, అభివృద్ధి బీజేపీతోనే సాధ్యమని పట్టభద్రులు, ఉపాధ్యాయులు తమ ఓట్లతో ధృవీకరించారని అన్నారు.
చిన్న శంకరంపేట మండల కేంద్రంలోని బస్టాండ్ సమీపంలో బీజేపీ అభ్యర్థుల గెలుపును పురస్కరించుకుని విజయోత్సవ సభను నిర్వహించారు. బీజేపీ మండల శాఖ అధ్యక్షుడు పోగుల రాజు ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు పటాకులు కాలుస్తూ, ఒకరికొకరు మిఠాయిలు తినిపించుకుంటూ సంబరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, బీజేపీ కార్యకర్తల కృషి వల్లే ఈ విజయం సాధ్యమైందని కొనియాడారు.
రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా బీజేపీ అభ్యర్థులే విజయం సాధిస్తారని పోగుల రాజు ఆశాభావం వ్యక్తం చేశారు. తెలంగాణలో బీజేపీకి ప్రజల మద్దతు పెరుగుతోందని, 2029 ఎన్నికల నాటికి బీజేపీ రాష్ట్రంలో అధికారంలోకి రావడం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. అభివృద్ధికి అంకితభావంతో పనిచేసే పార్టీగా బీజేపీ నిలుస్తుందన్నారు.
ఈ కార్యక్రమంలో జిల్లా కౌన్సిల్ సభ్యులు రాచర్ల అశోక్ కుమార్, ఓబీసీ మోర్చా జిల్లా ఉపాధ్యక్షులు మూర్తి శంకర్, మండల ప్రధాన కార్యదర్శి దశరథం నరేందర్ రెడ్డి, బీజేవైఎం నాయకులు సండ్రు మధు, ఎస్సీ మోర్చా మండల అధ్యక్షుడు కర్రోల్ల స్వామి, ఓబీసీ మోర్చా మండల అధ్యక్షుడు శంకర్ తదితరులు పాల్గొన్నారు.
