శ్రీకాకుళం జిల్లాలో మెడికల్ మాఫియా పెరిగిపోతుందని ఏఐవైఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు మొజ్జాడ యుగంధర్, జిల్లా నాయకులు బొత్స సంతోష్, కొన్న శ్రీనివాసరావులు ఆరోపించారు. నరసన్నపేటలో ఏర్పాటు చేసిన పత్రికా సమావేశంలో వారు మాట్లాడుతూ, జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో ఆర్‌ఎంపీ నుంచి ఎండి డాక్టర్ల వరకు అధిక ఫీజులు, అవాంఛిత స్కానింగ్‌లు, టెస్టుల పేరుతో ప్రజలను దోపిడీ చేస్తున్నారని విమర్శించారు.
ప్రైవేట్ హాస్పిటళ్లలో మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నిబంధనలను ఉల్లంఘిస్తూ నోటీసు బోర్డులు పెట్టకుండా ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నప్పటికీ, జిల్లా వైద్యాధికారులు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. పేద ప్రజలు అనారోగ్య సమస్యలతో ఆస్పత్రులకు వెళితే, ముందుగా టెస్టులు, స్కానింగ్ పేరుతో భారీగా డబ్బులు వసూలు చేస్తున్నారని అన్నారు. బిల్లులు ఇవ్వకుండా చికిత్స అందించడం పెద్ద స్కాంగా మారిందని మండిపడ్డారు.
అదేవిధంగా, శ్రీకాకుళం జిల్లా మత్తు పదార్థాలకు అడ్డాగా మారిందని, విద్యార్థులు, యువత గంజాయి, డ్రగ్స్ మత్తుకు బలవుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. పోలీసులు కొంతవరకు చర్యలు తీసుకున్నప్పటికీ, పూర్తి స్థాయిలో కట్టడి చేయలేకపోతున్నారని పేర్కొన్నారు. ప్రభుత్వం వెంటనే ప్రత్యేక దాడులు నిర్వహించి ఈ మాఫియాను అరికట్టాలని డిమాండ్ చేశారు.
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఎనిమిది నెలలు పూర్తయినా, నిరుద్యోగులకు మెగా డీఎస్సీ నిర్వహించలేదని ఏఐవైఎఫ్ నాయకులు విమర్శించారు. పేపర్లలో ప్రకటనలు ఇవ్వడం కాకుండా, తక్షణమే పరీక్ష నిర్వహించాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో రాష్ట్రవ్యాప్త పోరాటాలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఏఐవైఎఫ్ నాయకులు ఆర్. అరవింద్, పి. వాసు, వై. వేణు, నారాయణరావు, భాస్కరరావు తదితరులు పాల్గొన్నారు.
