ప్రముఖ సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మకు ఏపీ హైకోర్టులో ఊరట లభించింది. 6 వారాల పాటు తనపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని పోలీసులకు హైకోర్టు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. “కమ్మ రాజ్యంలో కడప రెడ్లు” సినిమా ద్వారా కుల వైషమ్యాన్ని రెచ్చగొట్టారంటూ మంగళగిరి వాసి బండారు వంశీకృష్ణ ఫిర్యాదు చేయడంతో, సీఐడీ పోలీసులు వర్మపై కేసు నమోదు చేశారు.
ఈ కేసును కొట్టివేయాలని వర్మ హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. తనపై పెట్టిన కేసు రాజకీయ కారణాలతోనే నమోదు అయ్యిందని వర్మ కోర్టుకు తెలిపారు. 2019లో విడుదలైన ఈ చిత్రానికి సెన్సార్ బోర్డు అనుమతి ఇచ్చిందని, అయితే 2024లో దీనిపై కేసు పెట్టడం అన్యాయమని వాదించారు.
వర్మ పిటిషన్పై నేడు విచారణ చేపట్టిన హైకోర్టు, సీఐడీ తీసుకోవాల్సిన తదుపరి చర్యలను 6 వారాల పాటు నిలిపివేయాలని ఆదేశించింది. విచారణ సమయంలో కోర్టు వాదనలు పరిశీలించి, వర్మకు తాత్కాలిక రక్షణ కల్పించింది. తదుపరి విచారణలో పూర్తి విచారణ తర్వాత నిర్ణయం తీసుకోనుంది.
హైకోర్టు తీర్పుతో రామ్ గోపాల్ వర్మకు తాత్కాలిక ఊరట లభించగా, తనకు అన్యాయంగా కేసు పెట్టారని వర్మ మీడియాతో తెలిపారు. ఈ కేసు తన స్వేచ్ఛకు భంగం కలిగించడమేనని, హక్కుల పరిరక్షణ కోసం తాను న్యాయపోరాటం కొనసాగిస్తానని స్పష్టం చేశారు.
