నగరంలోని 54వ డివిజన్ భగత్ సింగ్ కాలనీలో రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ శనివారం ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా ప్రతి నెలా ఒకటో తారీఖున ఉదయం 6 గంటల నుంచి పింఛన్ల పంపిణీ నిరభ్యంతరంగా జరుగుతుందని, సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు 68 లక్షల మందికి పింఛన్లు అందజేస్తున్నట్లు తెలిపారు.
గత ప్రభుత్వం పింఛన్ల కోసం వృద్ధులను, వికలాంగులను సచివాలయాల చుట్టూ తిప్పేసిందని, ఇప్పుడు టీడీపీ ప్రభుత్వం ఇంటింటికి వెళ్లి పింఛన్లు అందజేస్తోందని పేర్కొన్నారు. 99% పింఛన్ల పంపిణీ విజయవంతంగా పూర్తయిందని, అంతేకాకుండా పెంచిన మొత్తాలను కూడా మొదటి నెల నుంచే అమలు చేస్తున్నామని వివరించారు. సామాజిక పింఛన్లు రూ.4000, వికలాంగులకు రూ.6000, బెడ్ పై ఉన్న రోగులకు రూ.15000 చొప్పున పెంచి అందిస్తున్నామని వెల్లడించారు.
అన్న క్యాంటీన్లను జగన్ ప్రభుత్వం నిర్వీర్యం చేసిందని, ఇప్పుడు తిరిగి పునరుద్ధరించామని మంత్రి నారాయణ చెప్పారు. ఎన్నికల హామీల మేరకు ఉచిత గ్యాస్ సిలిండర్లు, రైతు భరోసా కింద రూ.20000 అందించామన్నారు. త్వరలో ‘తల్లికి వందనం’ పథకం ద్వారా ప్రతి విద్యార్థికి రూ.15000 అందజేస్తామని తెలిపారు. రాష్ట్ర మున్సిపాలిటీలకు ప్రజలు చెల్లించే పన్నులు ఇకపై వాటి అభివృద్ధికే వినియోగిస్తామని వివరించారు.
జాయింట్ కలెక్టర్ కార్తీక్, మున్సిపల్ కమిషనర్ సూర్య తేజ, డిప్యూటీ మేయర్లు రూప్ కుమార్ యాదవ్, తహసీన్, కార్పొరేటర్లు, ఇతర అధికారులు మంత్రి నారాయణతో కలిసి లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి పింఛన్లు అందజేశారు. ప్రజల సమస్యలను పరిశీలించి, వెంటనే పరిష్కారం చూపాలని అధికారులను ఆదేశించారు.
