విశాఖపట్నం డాబా గార్డెన్ సమీపంలోని డాడీ ఎల్ జె గ్రాండ్ హోటల్‌లో సోమవారం భారీ అగ్నిప్రమాదం జరిగింది. హోటల్‌లో మొత్తం 13 గదులుండగా, 9 గదుల్లో అతిథులు ఉన్నారని హోటల్ సిబ్బంది తెలిపారు. అగ్నిప్రమాదం గమనించిన వెంటనే హోటల్ సిబ్బంది అప్రమత్తమై ఫైరుసేఫ్టీ అధికారులకు సమాచారం అందించారు.
సమాచారం అందుకున్న వెంటనే ఫైరుసేఫ్టీ సిబ్బంది ఘటన స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేసేందుకు చర్యలు చేపట్టారు. టూ టౌన్ పోలీసులు కూడా అక్కడికి చేరుకొని సహాయక చర్యలు కొనసాగించారు. ప్రాణనష్టం జరగకుండా అతిథులను సురక్షితంగా బయటకు తరలించేందుకు అధికారులు జాగ్రత్తలు తీసుకున్నారు.
అగ్నిప్రమాదానికి గల కారణాలపై ప్రాథమిక దర్యాప్తు జరుగుతోంది. షార్ట్ సర్క్యూట్ వల్ల మంటలు చెలరేగి ఉండొచ్చని అధికారులు భావిస్తున్నారు. హోటల్ గదుల్లోని సామగ్రి పూర్తిగా కాలిపోయినట్లు తెలుస్తోంది. మంటలు అదుపులోకి వచ్చేనాటికి భారీ ఆస్తి నష్టం సంభవించినట్టు అంచనా వేస్తున్నారు.
ప్రమాదంపై హోటల్ యాజమాన్యం నుంచి పూర్తి వివరాలు సేకరించిన తర్వాత అగ్నిప్రమాదానికి గల ఖచ్చితమైన కారణాన్ని వెల్లడిస్తామని ఫైరుసేఫ్టీ అధికారులు తెలిపారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
