ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ ద్వారా 29 ఏళ్ల తర్వాత మెగా ఈవెంట్‌కు ఆతిథ్యం ఇస్తున్న పాకిస్థాన్‌కు తొలి మ్యాచ్‌లోనే ఊహించని షాక్ తగిలింది. న్యూజిలాండ్‌తో జరిగిన మొదటి మ్యాచ్‌లోనే పాక్ జట్టు ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. పాక్ ఓటమి పై అభిమానులు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఆటగాళ్ల ప్రదర్శన నిరాశ కలిగించిందని నెటిజన్లు విమర్శిస్తున్నారు.
ఈ మ్యాచ్‌లో పాక్ స్టార్ ఆటగాడు ఫఖర్ జమాన్ గాయపడ్డాడు. తొలి ఓవర్‌లోనే ఫీల్డింగ్ చేస్తూ గాయపడడంతో మైదానాన్ని వీడాడు. అతని స్థానంలో కమ్రాన్ గులామ్ సబ్‌స్టిట్యూట్‌గా వచ్చాడు. తొడ కండరాలు పట్టేయడంతో ఫఖర్ తీవ్ర అసౌకర్యానికి గురయ్యాడు. గాయం కారణంగా ఓపెనింగ్ చేయకుండా నాలుగో స్థానంలో బ్యాటింగ్ చేయాల్సి వచ్చింది.
ఫఖర్ 41 బంతుల్లో 24 పరుగులు మాత్రమే చేసి పెవిలియన్ చేరాడు. మైదానం వీడి డ్రెస్సింగ్ రూమ్‌కు వెళ్లే సమయంలో మెట్లు ఎక్కే క్రమంలో కూడా అతడు ఇబ్బంది పడటం కనిపించింది. తీవ్ర నిరాశతో డ్రెస్సింగ్ రూమ్‌లో కూర్చొని బోరున ఏడ్చేశాడు. ఇది చూసి అతని సహచర ఆటగాడు షాహీన్ అఫ్రిదీ, అసిస్టెంట్ కోచ్ అతడిని ఓదార్చే ప్రయత్నం చేశారు.
ఫఖర్ జమాన్ ఏడ్చిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నెటిజన్లు దీనిపై భిన్నంగా స్పందిస్తున్నారు. కొందరు అతని బాధను అర్థం చేసుకుంటూ మద్దతు తెలుపుతుండగా, మరికొందరు ఇది ఆటలో భాగమేనని కామెంట్స్ చేస్తున్నారు. ఛాంపియన్స్ ట్రోఫీలో పాక్ జట్టు పరాజయం కారణంగా అభిమానులు తీవ్రంగా నిరాశ చెందారు.
