తడలోని బోడి లింగాలపాడు వద్ద SRM హోటల్ ఎదురుగా నారాయణ స్కూల్ బస్సు బోల్తాపడిన ఘటన కలకలం రేపింది. ప్రమాద సమయంలో బస్సులో సుమారు 30 మంది విద్యార్థులు ప్రయాణిస్తున్నట్లు సమాచారం. డ్రైవర్ నిర్లక్ష్యమే ప్రమాదానికి కారణమని స్థానికులు ఆరోపిస్తున్నారు. స్కూల్ బస్సు సామర్థ్యాన్ని RTO అధికారులు సరిగా పరిశీలించారా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
బస్సు ప్రమాదానికి సంబంధించి డ్రైవర్ స్పందిస్తూ, బస్సు “చాసిస్” విరిగిపోవడంతో కంట్రోల్ తప్పి బస్సు బోల్తా పడిందని తెలిపారు. అయితే, ఈ వివరణపై స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. గతంలోనూ స్కూల్ బస్సుల నిర్వహణపై ఎన్నో సమస్యలు ఎదురవుతున్నాయని, సముచితమైన తనిఖీలు జరగకపోవడం వల్లనే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని విమర్శలు వచ్చాయి.
ప్రమాదంలో గాయపడిన విద్యార్థులను 108 అంబులెన్స్ ద్వారా సూళ్లూరుపేట, తడ ప్రభుత్వ ఆసుపత్రులకు తరలించారు. కొందరికి స్వల్ప గాయాలు కాగా, మరికొందరికి తీవ్రగాయాలు అయినట్లు తెలుస్తోంది. బాధిత విద్యార్థుల తల్లిదండ్రులు స్కూల్ బస్సుల భద్రతపై ఆందోళన వ్యక్తం చేశారు. డ్రైవర్ల అనుభవం, బస్సుల సామర్థ్యంపై ఖచ్చితమైన తనిఖీలు జరగాలని డిమాండ్ చేశారు.
ఈ ప్రమాదం పట్ల విద్యార్థుల తల్లిదండ్రులు, ప్రత్యక్ష సాక్షులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. RTO అధికారులు స్కూల్ బస్సుల ఫిట్‌నెస్ పట్ల నిర్లక్ష్యం వహిస్తున్నారా? లేదా? అనే ప్రశ్నలు వేడెక్కుతున్నాయి. స్కూల్ బస్సుల భద్రతను పటిష్టంగా అమలు చేయాలని, సమయానికి తనిఖీలు నిర్వహించాలని విద్యార్థుల తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు.

 
				 
				
			 
				
			 
				
			