బాపట్ల జిల్లా పిట్టల వారి పాలెంకు చెందిన పరిశా మోహన్ వెంకటేష్ 16 కవలరీ రెజిమెంట్‌లో విధులు నిర్వహిస్తున్నాడు. రాజస్థాన్ లోని ఫీల్డ్ ఫైరింగ్ ప్రాక్టీస్ సమయంలో బులెట్ బ్యాక్‌ఫైర్ కావడంతో తీవ్రంగా గాయపడిన వెంకటేష్, అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటన బుధవారం ఉదయం 11 గంటలకు రాజస్థాన్‌లో చోటు చేసుకుంది.
వెంకటేష్ భౌతికకాయాన్ని రాజస్థాన్ సూరత్‌గ్రహ్ మిలటరీ ఆసుపత్రిలో నుంచి ఢిల్లీకి రోడ్డు మార్గాన తరలించారు. అనంతరం ఎయిర్ ఇండియా విమానంలో గన్నవరం విమానాశ్రయానికి చేరుకుంది. విమానాశ్రయంలో మిలిటరీ అధికారుల గౌరవ వందనం అనంతరం వెంకటేష్ భౌతికకాయాన్ని స్వగ్రామానికి తరలించారు.
గన్నవరం విమానాశ్రయంలో మిలిటరీ అధికారుల ఆధ్వర్యంలో సైనిక గౌరవ వందనం ఇవ్వబడింది. కుటుంబ సభ్యులు, బంధువులు, సైనికాధికారులు, స్థానిక ప్రజలు అక్కడ వెంకటేష్‌కు నివాళులు అర్పించారు. విషాద ఛాయలు అలముకున్నాయి.
సైన్యంలో విధులు నిర్వహిస్తూ ప్రాణాలు కోల్పోయిన వెంకటేష్ భౌతికకాయాన్ని స్వగ్రామమైన పిట్టల వారి పాలెంకు తరలించారు. రేపు గ్రామంలో అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించనున్నారు. గ్రామస్థులు పెద్ద సంఖ్యలో అంతిమ యాత్రకు హాజరుకానున్నారు.

 
				 
				
			 
				
			 
				
			