దుబాయ్ వేదికగా జరుగుతున్న ఛాంపియన్స్ ట్రోఫీ రెండో మ్యాచ్‌లో భారత్ బౌలర్లు బంగ్లాదేశ్ బ్యాటర్లను ఓటమి అంచున నిలిపారు. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న బంగ్లా జట్టు తొలి రెండు ఓవర్లలోనే 2 వికెట్లు కోల్పోయింది. 2 పరుగులకే రెండు ప్రధాన వికెట్లు పడిపోవడంతో బంగ్లా బ్యాటింగ్ పూర్తిగా క్షీణించింది.
మొదటి ఓవర్‌లో మహమ్మద్ షమీ ఒక వికెట్ తీయగా, రెండో ఓవర్‌లో హర్షిత్ రాణా మరో వికెట్ పడగొట్టాడు. కాసేపు నిలదొక్కుకున్న బ్యాటర్లు మరోసారి భారత బౌలర్ల దెబ్బకు పెవిలియన్ చేరారు. షమీ తన రెండో వికెట్‌గా మెహదీ హసన్ మీరాజ్‌ను పెవిలియన్‌కు పంపాడు. దీంతో బంగ్లాదేశ్ బ్యాటింగ్ పూర్తిగా ఒత్తిడిలో పడిపోయింది.
బౌలింగ్‌కు వచ్చిన అక్షర్ పటేల్ తన తొలి ఓవర్‌లోనే రెండు కీలక వికెట్లు తీసి బంగ్లా బ్యాటింగ్‌ను మరింత కుదేల్చాడు. 35 పరుగులకే 5 వికెట్లు కోల్పోయిన బంగ్లా జట్టు తీవ్ర సంక్షోభంలో పడిపోయింది. ముఖ్యంగా సౌమ్య సర్కార్, కెప్టెన్ నజ్ముల్ హొస్సేన్ శాంటో, ముష్ఫికర్ రహీమ్ డకౌట్ కావడం జట్టుకు గట్టి ఎదురుదెబ్బగా మారింది.
ప్రస్తుతం క్రీజులో తౌహిద్ హృదయ్ (10 బ్యాటింగ్), జాకర్ అలీ (6 బ్యాటింగ్) ఉన్నా, భారత బౌలర్ల అద్భుత ప్రదర్శనతో బంగ్లా పరుగులు చేయడం కష్టంగా మారింది. 12 ఓవర్లు ముగిసే సరికి స్కోరు 49/5గా ఉంది. టీమిండియా బౌలింగ్ పటిష్టంగా ఉండటంతో, బంగ్లా జట్టు పరుగు వేగం పెంచే అవకాశం తక్కువగానే కనిపిస్తోంది.
