ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో జరుగుతున్న కుంభమేళాలో మహిళలు స్నానం చేస్తున్న వీడియోలు సోషల్ మీడియాలో ప్రత్యక్షమయ్యాయి. దీనిపై అప్రమత్తమైన యూపీ పోలీసులు, మహిళల గోప్యతను ఉల్లంఘించినందుకు సంబంధిత సోషల్ మీడియా ఖాతాలపై కేసులు నమోదు చేశారు. యూపీ పోలీస్ చీఫ్ ప్రశాంత్ కుమార్ ఆదేశాలతో కుంభమేళా పోలీస్ స్టేషన్లో ఈ కేసులు నమోదయ్యాయి.
సోషల్ మీడియా మానిటరింగ్ బృందం నివేదిక ప్రకారం, మహిళలు స్నానం చేస్తున్న దృశ్యాలు కొన్ని ఇన్స్టాగ్రామ్ ఖాతాల్లో మరియు టెలిగ్రామ్ ఛానళ్లలో వైరల్ అయ్యాయి. దీనిపై పోలీసు శాఖ దృష్టి సారించి, చట్టపరమైన చర్యలు చేపట్టింది. కుంభమేళా పవిత్రతను దెబ్బతీసేలా ఉన్న వీడియోలను అప్లోడ్ చేసిన ఖాతాదారులపై కేసులు నమోదు చేసి, విచారణ ప్రారంభించింది.
ఇన్స్టాగ్రామ్ ఖాతాపై గత నెల 17న కేసు నమోదైంది. ఖాతా నిర్వాహకుల వివరాలను సేకరించేందుకు పోలీసులు మెటా సంస్థ సహాయాన్ని కోరారు. ఈ విచారణలో ఒక ఖాతాకు సంబంధించిన కీలక సమాచారం లభించింది. మరో కేసులో టెలిగ్రామ్ ఛానల్ను గుర్తించి, దానిపై కూడా చట్టపరమైన చర్యలు చేపట్టేందుకు అధికారులు సిద్ధమయ్యారు.
మహిళల గౌరవాన్ని దెబ్బతీసే విధంగా వీడియోలు పంచుకునే వారిపై కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు. కుంభమేళా విశ్వాసాన్ని దెబ్బతీసేలా ప్రవర్తించే వారి వివరాలు తేల్చేందుకు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు. ప్రజలు కూడా ఇలాంటి అక్రమ చర్యలపై అప్రమత్తంగా ఉండాలని, ఎవరైనా ఇలాంటి వీడియోలు షేర్ చేస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని విజ్ఞప్తి చేశారు.
