విజయనగరంలో ఈరోజు జరిగిన పత్రికా సమావేశంలో రాష్ట్ర మంత్రివర్యులు కొండపల్లి శ్రీనివాస్, ఎమ్మెల్యే పూసపాటి అదితి విజయలక్ష్మి గజపతి రాజు, వైఎస్ జగన్ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. కిడ్నాప్, దాడి కేసులో అరెస్టై విజయవాడ జైల్లో ఉన్న వైసీపీ నేత వల్లభనేని వంశిని కలిసిన తర్వాత జగన్ చేసిన వ్యాఖ్యలు బాధ్యతారాహిత్యంగా ఉన్నాయని వారు పేర్కొన్నారు.
జగన్ వ్యాఖ్యలు అధికారులను బెదిరించే విధంగా ఉన్నాయని, ఇలాంటి మాటలు ఒక మాజీ ముఖ్యమంత్రి, ప్రస్తుత ఎమ్మెల్యే అనడం అనాగరికత అని మంత్రి శ్రీనివాస్ మండిపడ్డారు. న్యాయ వ్యవస్థపై ప్రభావం చూపించేలా, పరిపాలనా వ్యవస్థను అప్రతిష్ఠ పాలు చేసేలా ఆయన మాట్లాడటం దురదృష్టకరమని అన్నారు. క్రమశిక్షణ కలిగిన ప్రజాస్వామ్యంలో ఇలాంటి వ్యాఖ్యలు సమంజసం కాదని స్పష్టం చేశారు.
పూసపాటి అదితి విజయలక్ష్మి మాట్లాడుతూ, జగన్ వ్యాఖ్యలు ప్రభుత్వానికి విరుద్ధంగా, ప్రజాస్వామ్య విలువలకు వ్యతిరేకంగా ఉన్నాయని విమర్శించారు. న్యాయవ్యవస్థను, పోలీసులను తీవ్రంగా విమర్శించడం ద్వారా ఆయన చట్టాన్ని తక్కువ చేసి చూపే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. ప్రజా ప్రతినిధులుగా ప్రభుత్వాన్ని గౌరవించడం, న్యాయవ్యవస్థపై నమ్మకం కలిగి ఉండడం అవసరమని తెలిపారు.
ఈ సమావేశంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొని జగన్ వ్యాఖ్యలను ఖండించారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు, న్యాయవ్యవస్థ గౌరవాన్ని నిలబెట్టేందుకు టీడీపీ ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి శ్రీనివాస్, పూసపాటి అదితి స్పష్టం చేశారు. ఇలాంటి ప్రవర్తన ప్రజాస్వామ్య వ్యవస్థకు మాయని మచ్చ అని తెలిపారు.
