కాకినాడ జిల్లా తుని నియోజకవర్గం కోటనందూరు మండలం మదర్ క్యాంపస్ ఆవరణలో రోడ్డు భద్రత వారోత్సవాల సందర్భంగా అవగాహన సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా కోటనందూరు ఎస్‌ఐ టి. రామకృష్ణ హాజరై రోడ్డు భద్రత పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ప్రమాదాల నివారణ కోసం ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నియమాలు పాటించాలన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉంటే ప్రమాదాలను తగ్గించుకోవచ్చని వివరించారు. ముఖ్యంగా సెల్‌ఫోన్‌లో మాట్లాడుతూ వాహనం నడపడం ప్రమాదకరమని, ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరిస్తే ప్రాణాపాయ స్థితి నుంచి కాపాడుకోవచ్చని పేర్కొన్నారు. పాదచారులు కూడా రోడ్డు భద్రతా నియమాలను పాటించాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో మదర్ కాలేజీ కరస్పాండెంట్ పెనుముచ్చు నాగేశ్వరరావు, ప్రిన్సిపాల్ కేవి రాజు, హెచ్ఎం కే. నాగేశ్వరరావు, ఉపాధ్యాయ బృందం, వివిధ స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు. రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని, డ్రైవింగ్ సమయంలో అప్రమత్తంగా ఉండాలని సూచనలు అందించారు.
కార్యక్రమం ముగింపు సందర్భంగా విద్యార్థులు రోడ్డు భద్రత ప్రమాణాలపై ప్రమాణం చేశారు. అవగాహనతోనే ప్రమాదాలను తగ్గించవచ్చని, ప్రతి ఒక్కరూ బాధ్యతగా ఉండాలని అధికారులు పిలుపునిచ్చారు. రోడ్డు భద్రతను పాటించడం ప్రతి ఒక్కరి కర్తవ్యమని, యువత ముఖ్యంగా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
