ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నేడు నెల్లూరు జిల్లా పర్యటనలో భాగంగా కందుకూరులో స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మెటీరియల్ రికవరీ సెంటర్ ప్రారంభించి, చెత్తను సంపదగా మార్చే ప్రణాళికలను వివరించారు. గ్రామాల్లో తడి చెత్త, పొడి చెత్తకు సంబంధించిన అవగాహన ప్రజలకు కల్పించాలని అధికారులను ఆదేశించారు.
సీఎం చంద్రబాబు మాట్లాడుతూ, గ్రామాల్లో పరిశుభ్రత కోసం సర్పంచిలు కృషి చేయాలని, పంచాయతీ నిధులను సద్వినియోగం చేసుకుని గ్రామాలను ఆదర్శంగా తీర్చిదిద్దాలని సూచించారు. అన్ని గ్రామాలకు ర్యాంకులు ఇచ్చే విధానాన్ని అమలు చేస్తామని, ఉత్తమంగా పని చేసే సర్పంచిలను ప్రభుత్వం ప్రత్యేకంగా సత్కరిస్తుందని తెలిపారు.
మంత్రి నారాయణకు ప్రత్యేక టార్గెట్ ఇచ్చానని చంద్రబాబు చెప్పారు. అక్టోబర్ 2 గాంధీ జయంతి నాటికి పట్టణాల్లో చెత్త పూర్తిగా తొలగించాల్సిందిగా మున్సిపల్ శాఖకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశామని వివరించారు. చెత్త నిర్మూలన కోసం ప్రత్యేక చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
గత ప్రభుత్వ హయాంలో 85 లక్షల మెట్రిక్ టన్నుల చెత్త పేరుకుపోయిందని చంద్రబాబు ఆరోపించారు. చెత్త పన్ను విధించడం ప్రజలకు ఇబ్బందికరమని వ్యాఖ్యానించారు. రాష్ట్రాన్ని పూర్తిగా స్వచ్ఛాంధ్ర ప్రదేశ్‌గా మార్చేందుకు ప్రభుత్వ అంకితభావంతో పనిచేస్తుందని సీఎం స్పష్టం చేశారు.