చిన్న పిల్లల శారీరక ఎదుగుదలకు సమతుల ఆహారం చాలా ముఖ్యం. విటమిన్లు, ప్రొటీన్లు, మినరల్స్ సమృద్ధిగా ఉండే ఆహారాన్ని అందించాలి. ముఖ్యంగా ఎముకల పెరుగుదల కోసం కాల్షియం అందించడం చాలా అవసరం. వైద్య నిపుణుల ప్రకారం, పిల్లల ఆరోగ్యవంతమైన ఎదుగుదలకు మునగ ఆకులు ఎంతో మేలుగా ఉపయోగపడతాయి.
మునగ ఆకులలో కాల్షియం అధికంగా ఉండటంతో పిల్లల ఎముకలను బలంగా పెంచుతుంది. మునగ ఆకులను ఉడికించి వాటి నీటిని పరగడుపున తాగిస్తే మంచి ఫలితం కనిపిస్తుంది. అలాగే, పాలకూర, అరటిపండు, మునగ ఆకులను మిక్స్ చేసి స్మూతీగా తాగిస్తే శరీరానికి పోషకాలు సమృద్ధిగా అందుతాయి. ఇది పిల్లల ఆరోగ్యానికి ఎంతో మంచిది.
మునగ ఆకులను క్యారెట్, దోసకాయలతో కలిపి జ్యూస్ చేయడం ద్వారా రుచికరంగా, ఆరోగ్యకరంగా ఉంటుంది. పిల్లలు నేరుగా తాగలేకపోతే వడగట్టి, తేనె కలిపి ఇవ్వొచ్చు. అలాగే, మునగాకు పొడిని గోరు వెచ్చని పాలలో కలిపి నిద్రకు ముందు తాగిస్తే శరీరానికి తగినంత కాల్షియం అందుతుంది.
రోజువారీ కూరలలో, సూప్‌లలో, సలాడ్లలో మునగాకు పొడి చేర్చడం వల్ల రుచితో పాటు ఆరోగ్య ప్రయోజనాలు అందుతాయి. కానీ కేవలం మునగ ఆకులపై మాత్రమే ఆధారపడకుండా, పిల్లలకు సమతుల ఆహారం అందించడం అవసరం. దీనివల్ల వారి ఎదుగుదల ఆరోగ్యంగా జరుగుతుంది.