నంగునూరు మండలం రాజగోపాలపేట ఫైరింగ్ రేంజ్లో జిల్లాలోని పోలీసు సిబ్బందికి వార్షిక ఫైరింగ్ ప్రాక్టీస్ నిర్వహించారు. పోలీస్ కమిషనర్ డాక్టర్ బి. అనురాధ, ఐపీఎస్ గారు ఈ కార్యక్రమాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె యం.పీ 5 రైఫిల్, గ్లాక్ పిస్టల్లతో స్వయంగా ఫైరింగ్ చేసి పోలీసు సిబ్బందిని ప్రోత్సహించారు. పోలీస్ అధికారులకు 9 ఎం ఎం పిస్టల్, ఎస్ ఎల్ ఆర్, ఇన్సాస్ వంటి ఆయుధాలతో శిక్షణ ఇచ్చారు.
ఈ శిక్షణ ద్వారా పోలీసులకు వ్యూహాత్మక ఆలోచనా విధానం, ఆత్మవిశ్వాసం పెంపొందేలా చర్యలు తీసుకున్నారు. సమీపంలో ప్రత్యర్థిని ఎదుర్కోవడం, ముష్కరులను నిరాయుధులను చేయడం, స్కిల్ డెవలప్మెంట్ వంటి అంశాలపై ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. కమిషనర్ అనురాధ మాట్లాడుతూ, శాంతి భద్రతల పరిరక్షణలో సాంకేతికతతో పాటు ఆయుధ పరిజ్ఞానం కూడా ఎంతో అవసరమని తెలిపారు.
పోలీసు సిబ్బంది అధునాతన టెక్నాలజీని ఉపయోగించడంతోపాటు ఆయుధాలపై ప్రావీణ్యం సాధించాలని కమిషనర్ సూచించారు. ఈ శిక్షణ ద్వారా వారి విధి నిర్వహణ నైపుణ్యం పెరుగుతుందని తెలిపారు. ఫైరింగ్ ప్రాక్టీస్‌లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన పోలీసు అధికారులకు త్వరలో అవార్డులు అందజేస్తామని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో ఏఆర్ అడిషనల్ డీసీపీ సుభాష్ చంద్రబోస్, ఏసీపీలు మధు, సతీష్, పురుషోత్తం రెడ్డి, సుమన్ కుమార్, రవీందర్, ఇన్స్పెక్టర్లు శ్రీధర్, కిరణ్, ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ఫైరింగ్ ప్రాక్టీస్ విజయవంతంగా నిర్వహించేందుకు అధికారుల సూచనలు పాటించారని తెలిపారు.

 
				 
				
			 
				
			