ప్రపంచ క్యాన్సర్ దినోత్సవాన్ని పురస్కరించుకుని తిరుపతిలో టాటా క్యాన్సర్ హాస్పిటల్ ఆధ్వర్యంలో అవేరెనెస్ ప్రోగ్రాం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు, జిల్లా కలెక్టర్ డా. వెంకటేశ్వర్, తిరుపతి ఎమ్మెల్యే ఆరని శ్రీనివాసులు పాల్గొన్నారు. స్థానిక మున్సిపల్ హైస్కూల్ గ్రౌండ్ లో జరిగిన ఈ కార్యక్రమంలో విద్యార్థులు, ఆసుపత్రి సిబ్బంది, ఇతర అధికారులు హాజరయ్యారు.
ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ క్యాన్సర్ వ్యాధిని ముందుగా గుర్తిస్తే చికిత్స ద్వారా నయం చేసుకోవచ్చని తెలిపారు. భయపడకుండా వైద్య సలహా తీసుకుని ఆరోగ్యకరమైన జీవనశైలిని పాటించాలని సూచించారు. గ్రామీణ ప్రాంతాల్లో క్యాన్సర్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వం పింకు బస్సులు అందుబాటులోకి తెచ్చిందని వివరించారు.
ఇంటివద్దనే స్క్రీనింగ్ ద్వారా క్యాన్సర్‌ను ప్రాథమిక దశలోనే గుర్తించే అవకాశముందని, అవసరమైతే ఆసుపత్రిలో చికిత్స తీసుకోవాలని ప్రజలకు సూచించారు. ఒకప్పుడు క్యాన్సర్ చికిత్స ఖరీదైనదిగా భావించబడేదని, కానీ టాటా గ్రూపు తిరుపతిలో వరల్డ్ క్లాస్ క్యాన్సర్ హాస్పిటల్ ఏర్పాటు చేయడం విశేషమని తెలిపారు.
అనంతరం అవేరెనెస్ పెంచేందుకు వాకథాన్, సైక్లోథాన్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డీఎం & హెచ్‌ఓ బాలకృష్ణ నాయక్, టాటా క్యాన్సర్ హాస్పిటల్ డైరెక్టర్ ప్రశాంత్, మెటర్నిటీ సూపరింటెండెంట్ పార్థసారథి, విద్యార్థులు, ఎన్సీసీ సభ్యులు, హాస్పిటల్ సిబ్బంది పాల్గొన్నారు.

 
				 
				
			 
				
			 
				
			