దుబ్బాక నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి చెరుకు శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ, గెలిచినా ఓడినా నియోజకవర్గ ప్రజల మధ్య ఉంటానని స్పష్టం చేశారు. ప్రజల సంక్షేమమే తన ధ్యేయమని, తన తండ్రి స్వర్గీయ ముత్యంరెడ్డి ఆశయాలను కొనసాగిస్తూ ప్రజల కోసం పోరాటం చేస్తానని తెలిపారు. నియోజకవర్గ ప్రజలు తనకు కన్న తల్లిదండ్రుల్లాంటి వారని, వారి సమస్యల పరిష్కారానికి ఎప్పుడూ సిద్ధంగా ఉంటానని చెప్పారు.
గత మల్లన్న జాతర సందర్భంగా నార్సింగి మండలంలోని వడ్డెర కాలనీలో సిసి రోడ్డు నిర్మాణం కోసం హామీ ఇచ్చిన చెరుకు శ్రీనివాస్ రెడ్డి, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో ఎన్ఆర్ఈజీఎస్ నిధుల ద్వారా రూ. 25 లక్షల వ్యయంతో నిర్మించిన రోడ్డును పరిశీలించారు. కాలనీవాసులతో సమావేశమై, వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. 30 సంవత్సరాలుగా రోడ్డు సమస్యను ఎదుర్కొన్నామని, రోడ్డు నిర్మాణం వల్ల తమకు ఎంతో ఉపశమనం కలిగిందని స్థానికులు తెలిపారు.
కాలనీవాసులు మాట్లాడుతూ, యూత్ కాంగ్రెస్ నాయకుడు సంపత్ రెడ్డి, యాదగిరి యాదవ్, మార్కెట్ కమిటీ మాజీ వైస్ చైర్మన్ యెన్నం రాజేందర్ రెడ్డి సహకారంతో ఈ అభివృద్ధి సాధ్యమైందని చెప్పారు. భవిష్యత్తులో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలని కోరారు. కాలనీలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, మౌలిక సదుపాయాల కల్పన కోసం నిధులు మంజూరు చేయాలని అభ్యర్థించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా ఇన్చార్జి మంత్రి కొండ సురేఖ, మండల నాయకులు, సీనియర్ నేతలు బాలరాజ్ గౌడ్, అంచనూరు రాజేష్, రాజేష్ గౌడ్, మాజీ ఎంపీపీ మాసుల శ్రీనివాస్, కాలనీవాసులు తదితరులు పాల్గొన్నారు. కాలనీవాసులు అభివృద్ధి హామీలు అమలు చేయడం పట్ల హర్షం వ్యక్తం చేశారు.
