ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం కిష్టారం అంబేద్కర్ కాలనీ ప్రజలు బొగ్గునుసి కాలుష్యానికి వ్యతిరేకంగా గత మూడు రోజులుగా రిలే నిరాహార దీక్ష చేపట్టారు. కాలనీ ప్రజలు శెయిలో బంకర్ కారణంగా తీవ్ర కాలుష్య సమస్యలు ఎదుర్కొంటున్నామని, దీని వల్ల అనేకమంది అనారోగ్యానికి గురవుతున్నారని ఆరోపిస్తున్నారు. కాలనీ ప్రజలు దీనిపై స్పందించాలని, పరిష్కారం చూపాలని అధికారులను డిమాండ్ చేశారు.
ఈ నేపథ్యంలో, కిష్టారం ఓసి పిఓ నరసింహారావు శైలో బంకర్ వైపు వెళ్లే సమయంలో, దీక్షా శిబిరంలో ఉన్న కాలనీ ప్రజలు ఆయన కారు వెనకకు రాకుండా కంచవేసి బంధించారు. ప్రజలు పిఓపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ, కాలుష్య సమస్యకు ఆయననే బాధ్యుడిగా పేర్కొన్నారు. ఈ ఘటనతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.
పిఓ నరసింహారావు ఆ ప్రాంతం నుంచి బయటికి వెళ్లలేని పరిస్థితి ఏర్పడగా, సత్తుపల్లి సీఐ కిరణ్ రంగ ప్రవేశం చేశారు. పోలీసుల ప్రయత్నంతో పరిస్థితిని నియంత్రించేందుకు చర్చలు జరిగాయి. కాలనీ ప్రజలు తమ సమస్యకు తక్షణ పరిష్కారం చూపించాలని, లేనిచో నిరసనలు కొనసాగుతాయని హెచ్చరించారు.
ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని తక్షణమే కాలుష్య నివారణ చర్యలు చేపట్టాలని స్థానికులు అధికారులను కోరుతున్నారు. కాలుష్య నియంత్రణకు మెరుగైన పరిష్కారం తీసుకోవాలని, కాలనీలో నివాస గృహాలకు రక్షణ కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు.

 
				 
				
			 
				
			