రీజినల్ రింగ్ రోడ్డు నిర్మాణ పనులను వేగవంతం చేయాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు, ఆర్ అండ్ బి శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అధికారులను ఆదేశించారు. గురువారం డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ సచివాలయంలో ఆర్ అండ్ బి శాఖ ఫ్రీ బడ్జెట్ సమావేశంలో పలు అంశాలపై చర్చ జరిగింది. రీజినల్ రింగ్ రోడ్డు డీపీఆర్, 3D డిజైన్లు వంటి పనులు త్వరగా పూర్తి చేయాలని మంత్రులు సూచించారు. నిధుల కొరత లేదని, పనులు వేగంగా సాగితే తక్షణమే నిధులు విడుదల చేస్తామని భట్టి విక్రమార్క భరోసా ఇచ్చారు.
రాష్ట్రవ్యాప్తంగా ఆర్ అండ్ బి శాఖకు సంబంధించిన విలువైన ఆస్తుల వివరాలు సేకరించాలని, అవి అన్యాక్రాంతం కాకుండా అన్ని స్థాయిల్లో చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. HAM (హైబ్రిడ్ యాన్యూటీ హెడ్) రహదారుల నిర్మాణాన్ని వేగవంతం చేయాలని సూచించారు. జిల్లా కేంద్రాల నుంచి రాష్ట్ర రాజధానికి వచ్చే రహదారులను అభివృద్ధి చేయాలని కోరారు. ప్రతి రోజు వేలాది మంది హైదరాబాద్‌కు రావడం, తిరిగి వెళ్లడం జరుగుతుందని, వీరికి మెరుగైన రహదారి సదుపాయాలు కల్పించాలన్నారు.
ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ నిధులను సమర్థవంతంగా వినియోగించాలని, కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో తెచ్చిన ఈ చట్టాన్ని గత పాలకులు నిర్లక్ష్యం చేశారని భట్టి విక్రమార్క అన్నారు. ప్రస్తుతం ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో, ఈ చట్టాన్ని పూర్తిస్థాయిలో అమలు చేయాలని స్పష్టం చేశారు. నిధుల మేరకు స్థానికంగా చేపట్టే పనుల గురించి ప్రజలకు తెలియజేయాల్సిన బాధ్యత అధికారులదేనని పేర్కొన్నారు.
కొత్త ఎయిర్‌పోర్టుల నిర్మాణానికి ఆర్ అండ్ బి శాఖ విస్తృత ప్రణాళికలు రూపొందిస్తోందని మంత్రులు వెల్లడించారు. ఏవియేషన్ రంగానికి తగిన ప్రోత్సాహం అందిస్తామని చెప్పారు. సమావేశంలో స్పెషల్ చీఫ్ సెక్రటరీలు రామకృష్ణారావు, వికాస్ రాజ్, డిప్యూటీ సీఎం ప్రత్యేక కార్యదర్శి కృష్ణ భాస్కర్, ఆర్థిక శాఖ కార్యదర్శి హరిత తదితరులు పాల్గొన్నారు.

 
				 
				
			 
				
			 
				
			