శివరాజ్ కుమార్ ప్రధాన పాత్రలో నటించిన ‘భైరతి రణగల్’ ఊరి కోసం పోరాడే కథానాయకుడి జీవితం ఆధారంగా రూపొందింది. ఈ సినిమా గత ఏడాది నవంబర్ 15న విడుదలై, డిసెంబర్ 25న అమెజాన్ ప్రైమ్‌లో ప్రసారం అయ్యింది. ఇప్పుడు ‘ఆహా’ ద్వారా కూడా అందుబాటులోకి వచ్చింది. నార్తన్ దర్శకత్వం వహించిన ఈ సినిమా శివరాజ్ కుమార్ స్వంత బ్యానర్‌లో నిర్మితమైంది. గ్రామ ప్రజల సంక్షేమం కోసం పోరాడే ఓ వ్యక్తి కథగా ఇది తెరకెక్కింది.
ఈ కథ 1985లో ప్రారంభమవుతుంది. భైరతి రణగల్ (శివరాజ్ కుమార్) తన ఊరిలో మంచినీటి సమస్యను పరిష్కరించేందుకు పోరాటం చేస్తాడు. ప్రభుత్వ నిర్లక్ష్యం చూసి ఊరిలోని ప్రజలను కాపాడటానికి ఎదురు నిలుస్తాడు. ఈ క్రమంలో అతడు నాటు బాంబులతో అధికారులను హెచ్చరించడంతో 21 ఏళ్లపాటు జైలుకు వెళతాడు. తిరిగి వస్తే ఊరి పరిస్థితి పూర్తిగా మారిపోతుంది. తన చెల్లెలి ప్రేమ, తనకు నమ్మిన వారు ఎదుర్కొంటున్న సమస్యలు, గ్రామ ప్రజల హక్కుల కోసం అతడు చేసే పోరాటమే కథకు ప్రధాన బలంగా నిలుస్తుంది.
గ్రామాలను కార్పొరేట్ సంస్థలు ఆక్రమించే తీరు, వాటికి రాజకీయ నాయకుల మద్దతు, ఇలాంటి సమస్యలకు ఎదురొడ్డి పోరాడే నాయకుడి ప్రయత్నాలే ఈ కథలో ప్రధానాంశం. భైరతి రణగల్ తన ప్రజల కోసం ఎంతవరకైనా పోరాడతాడు. మంచి చేయడానికి కూడా చెడ్డవాడిగా మారాల్సిన అవసరం ఉంటుందనే సూత్రాన్ని ఈ సినిమా నమ్మిస్తుంది. గ్రామ ప్రజల రక్షణ కోసం పోరాడే వ్యక్తిగా శివరాజ్ కుమార్ నటన ఆకట్టుకుంటుంది.
శివరాజ్ కుమార్ తన పాత్రలో అత్యద్భుతంగా నటించాడు. రుక్మిణి వసంత్ పాత్ర పరిమితమైనప్పటికీ, అందంగా కనిపించింది. విలన్ పాత్రలో రాహుల్ బోస్ మరింత పవర్‌ఫుల్‌గా ఉండి ఉంటే బాగుండేది. నవీన్ కుమార్ సినిమాటోగ్రఫీ, యాక్షన్ సీన్స్, రవి బస్రూర్ సంగీతం సినిమాకు బలాన్నిచ్చాయి. మొత్తం మీద శివరాజ్ కుమార్ అభిమానులకు నచ్చేలా ఈ సినిమా రూపొందింది.