ఆంధ్రప్రదేశ్‌లో బర్డ్ ఫ్లూ కలకలం రేపుతోంది. ఏలూరు జిల్లాలో ఓ వ్యక్తికి బర్డ్ ఫ్లూ సోకినట్లు వైద్యశాఖ అధికారులు ధృవీకరించారు. ఉంగుటూరు మండలంలోని కోళ్ల ఫారం సమీపంలో నివసించే వ్యక్తికి ఈ వైరస్ సోకినట్లు తేలింది. దీంతో జిల్లా అధికారులు అప్రమత్తమయ్యారు. ప్రజలను వైరస్ ప్రభావం నుంచి రక్షించేందుకు ప్రత్యేక మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేసి, బర్డ్ ఫ్లూ లక్షణాలు ఉన్న వారిని పరీక్షిస్తున్నారు.
ఉభయ గోదావరి జిల్లాలు, ఉమ్మడి కృష్ణా జిల్లాలో బర్డ్ ఫ్లూ తీవ్రత అధికంగా ఉంది. కానూరులో కోళ్లకు బర్డ్ ఫ్లూ సోకినట్లు ఇప్పటికే నిర్ధారణ కాగా, గోదావరి జిల్లాల్లో 50 లక్షల పైగా కోళ్లు ఈ వైరస్ కారణంగా మరణించాయని అధికారులు తెలిపారు. కోళ్ల ఫామ్స్ పరిసరాల్లో నివసించే ప్రజలు ఆరోగ్య సమస్యలు ఎదుర్కొనే అవకాశం ఉందని వైద్యులు హెచ్చరించారు.
బర్డ్ ఫ్లూ ప్రభావంతో చికెన్ వినియోగం తగ్గిపోయింది. వైద్యశాఖ అధికారులు కొంతకాలం పాటు చికెన్ తినడం మానుకోవాలని ప్రజలకు సూచనలు అందించారు. దీంతో తెలుగు రాష్ట్రాల్లో చికెన్ ధరలు గణనీయంగా పడిపోయాయి. పలుచోట్ల చికెన్ వ్యాపారం తీవ్రంగా దెబ్బతిన్నట్లు వ్యాపారులు చెబుతున్నారు.
ప్రభుత్వం తక్షణమే అన్ని జిల్లాల్లో సమగ్ర పరిశీలనలు చేపట్టాలని నిర్ణయించింది. వైరస్ వ్యాప్తిని నివారించేందుకు కోళ్ల ఫామ్స్ పరిశుభ్రతపై దృష్టి పెట్టాలని ఆదేశాలు జారీ చేసింది. బర్డ్ ఫ్లూ లక్షణాలు ఉంటే వెంటనే వైద్యులను సంప్రదించాలని అధికారులు ప్రజలకు సూచించారు.
