ప్రధాని నరేంద్ర మోదీ ప్రస్తుతం విదేశీ పర్యటనలో ఉన్నారు. నాలుగు రోజుల విదేశీ పర్యటనలో భాగంగా ఆయన ఫ్రాన్స్, అమెరికా పర్యటిస్తున్నారు. అయితే, మోదీ ప్రయాణిస్తున్న విమానంపై ఉగ్రదాడి జరగొచ్చని వచ్చిన బెదిరింపు సమాచారం కలకలం సృష్టించింది. ముంబయి పోలీస్ కంట్రోల్ రూమ్‌కు ఫిబ్రవరి 11న ఓ ఫోన్ కాల్ రావడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.
ఈ ఫోన్ కాల్లో ఓ వ్యక్తి ప్రధాని విమానాన్ని లక్ష్యంగా చేసుకుని ఉగ్రదాడి జరగొచ్చని హెచ్చరించాడు. ముంబయి పోలీసులు ఈ సమాచారం ఆధారంగా ఇతర దర్యాప్తు సంస్థలను అప్రమత్తం చేశారు. బెదిరింపు ఫోన్ చేసిన వ్యక్తిని గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. విచారణలో అతని మానసిక స్థితి సరిగాలేదని తేలిందని అధికారులు తెలిపారు.
మోదీ ప్రస్తుతం ఫ్రాన్స్‌లో ఉన్నారు. అక్కడ కృత్రిమ మేధ కార్యాచరణ సదస్సులో పాల్గొననున్నారు. ఈ సమావేశం ముగిసిన తర్వాత ప్రధాని అమెరికా పర్యటనకు బయలుదేరనున్నారు. అక్కడ అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌తో ద్వైపాక్షిక సమావేశం జరపనున్నారు.
ప్రధానిపై వచ్చిన ఈ బెదిరింపు నేపథ్యంలో భద్రతా ఏర్పాట్లను మరింత కట్టుదిట్టం చేశారు. ఎయిర్ ఇండియా వన్ విమానం భద్రతను పెంచి, ప్రతి కదలికను నిశితంగా పరిశీలిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి స్థాయిలో దర్యాప్తు కొనసాగుతోంది.
