చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధానార్చకుడు రంగరాజన్ పై జరిగిన దాడికి సంబంధించి రాజేంద్రనగర్ డీసీపీ శ్రీనివాస్ కీలక విషయాలు వెల్లడించారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు వీరరాఘవరెడ్డి సహా మొత్తం ఆరుగురిని పోలీసులు అరెస్టు చేసినట్లు తెలిపారు. అరెస్టైన వారిలో ఇద్దరు మహిళలు ఉన్నారు.
డీసీపీ శ్రీనివాస్ మాట్లాడుతూ, నిందితులు రామరాజ్య స్థాపన కోసం రంగరాజన్ ఆర్థిక సాయం అందించాలనే డిమాండ్ పెట్టారని తెలిపారు. ఆ డిమాండ్ ను ఆయన తిరస్కరించడంతో దాడికి పాల్పడ్డారని వివరించారు. ఈనెల 7వ తేదీన వీరరాఘవరెడ్డి తన 20 మంది అనుచరులతో కలిసి రంగరాజన్ ఇంటిపై దాడి చేశారని తెలిపారు.
ఈ దాడిలో రంగరాజన్ కుమారుడిని కూడా గాయపరిచారని పోలీసులు వెల్లడించారు. చిలుకూరు బాలాజీ ఆలయ మేనేజింగ్ కమిటీ చైర్మన్ ఎంవీ సౌందర్ రాజన్ దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు ముమ్మరం చేసినట్లు అధికారులు తెలిపారు.
అరెస్టైన నిందితులను రిమాండ్ కు పంపించినట్లు డీసీపీ శ్రీనివాస్ తెలిపారు. నిందితులలో కొందరు ఖమ్మం, నిజామాబాద్ ప్రాంతాలకు చెందినవారుగా గుర్తించామని, ఈ కేసులో మరింత లోతుగా దర్యాప్తు కొనసాగుతోందని చెప్పారు.
