జోగులాంబ గద్వాల జిల్లా ఐజ మండల కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో బీఆర్ఎస్ యువజన విభాగం ఆధ్వర్యంలో ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సమావేశానికి యువజన విభాగం నాయకుడు రామకృష్ణ ముదిరాజ్ అధ్యక్షత వహించగా, జిల్లా అధ్యక్షుడు మాల మల్లికార్జున్ సమక్షంలో కార్యకర్తలు హాజరయ్యారు. బీసీలకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు.
రామకృష్ణ ముదిరాజ్ మాట్లాడుతూ, బీసీలకు ఇచ్చిన హామీ ప్రకారం 42% రిజర్వేషన్ అమలు చేయాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం సమగ్ర కుటుంబ సర్వే పేరుతో బీసీల జనాభాను దాదాపు 25 లక్షల మందిని తగ్గించి చూపిందని ఆరోపించారు. ఇది బీసీలకు తీరని అన్యాయం అని, వారికి రాజకీయ ప్రాధాన్యతను తగ్గించడానికి ప్రయత్నిస్తున్నారని విమర్శించారు.
అసెంబ్లీలో 50% సీట్లు బీసీలకు కేటాయిస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం, చివరకు కేవలం 29 సీట్లు మాత్రమే ఇచ్చిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పుడు సమగ్ర సర్వే పేరుతో బీసీ సమాజాన్ని మరింత వెనుకబాటుకు నెట్టేందుకు కుట్రలు జరుగుతున్నాయని పేర్కొన్నారు. బీసీల హక్కుల కోసం బీఆర్ఎస్ పార్టీ పోరాడుతుందని స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు మాల మల్లికార్జున్, తుప్పత్రాల వీరేష్, సత్యం, ఉప సర్పంచ్ వీరేష్ గౌడ్, మద్దిలేటి, అంజి రజక, మోహన్ గౌడ్, శివన్న, తుపత్రాల అశోక్ కుమార్, నరసింహులు, దేవబండ అశోక్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

 
				 
				
			 
				
			