పిఠాపురం ఆశ్రమంలో జరిగిన శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం 97వ వార్షిక జ్ఞాన మహాసభల్లో పీఠాధిపతి డాక్టర్ ఉమర్ ఆలీషా భక్తులకు అనుగ్రహ భాషణం అందించారు. మానవుడు తన జీవితంలో ఎదురయ్యే కష్టసుఖాలను సమంగా స్వీకరించి, మానవత్వాన్ని అలవరచుకోవాలని పిలుపునిచ్చారు. మనసు మానవుని మంచి, చెడులను ప్రభావితం చేస్తుందని, దానిని నియంత్రించేందుకు ఆధ్యాత్మిక తాత్విక జ్ఞానం అవసరమని వివరించారు. అరిషడ్వర్గాలను నియంత్రించుకుంటే మనసును మంచి మార్గంలో ఉంచుకోవచ్చని తెలిపారు.
సభలో ముఖ్య అతిధిగా పాల్గొన్న నిష్కామ ఫౌండేషన్ నిర్వాహకురాలు అరుణ వైరాగ్యం గురించి మాట్లాడారు. నిత్య, అనిత్య విషయాలను అవగాహన చేసుకోవడం వల్ల వైరాగ్యం సిద్ధిస్తుందని తెలిపారు. ధనం, బంధం, కీర్తి లాంటి కోరికలను తగ్గించుకుంటే మానవుడు శాశ్వత ఆనందాన్ని పొందగలడని వివరించారు. పీఠం నిర్వహిస్తున్న ఆధ్యాత్మిక కార్యక్రమాలు, త్రయీ సాధనలు మానవత్వాన్ని పెంపొందించేందుకు మార్గదర్శకంగా ఉంటాయని చెప్పారు.
ఈ కార్యక్రమంలో ఎన్.ఆర్.ఐ. సభ్యులు పేరూరి విజయరామ సుబ్బారావు కృత్రిమ మేధస్సు మరియు ఆధ్యాత్మికత గురించి మాట్లాడారు. మానవుడు ఆధ్యాత్మిక జ్ఞానాన్ని పెంపొందించుకుంటే, కృత్రిమ మేధస్సును సమాజానికి మేలుగా ఉపయోగించుకోవచ్చని తెలిపారు. భవిష్యత్తులో ఈ టెక్నాలజీను మానవత్వ ప్రయోజనాల కోసం వినియోగించాల్సిన అవసరాన్ని వివరించారు.
సభ ముగింపులో పీఠాధిపతి ఉమర్ ఆలీషాను గజమాలతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో భవానీ పీఠం పీఠాధిపతి శివరామ కృష్ణ, పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. సభకు హాజరైన భక్తులకు ఉచిత భోజన సదుపాయం కల్పించబడింది. 216 మంది భక్తులకు మంత్రోపదేశం ఇవ్వబడింది. సంగీత విభావరిలో ఉమా ముకుంద బృందం ఆలపించిన భక్తి గీతాలు సభికులను ఆకట్టుకున్నాయి.