తెలంగాణ రాష్ట్రంలో విద్యుత్ డిమాండ్ భారీగా పెరుగుతోంది. వేసవి ప్రభావంతో పాటు యాసంగి పంటలకు అవసరమైన నీటి పంపింగ్ కారణంగా విద్యుత్ వినియోగం గణనీయంగా పెరిగింది. ఫిబ్రవరి నెలలోనే విద్యుత్ డిమాండ్ అత్యధికంగా 15,920 మెగావాట్లకు చేరుకుంది. గతేడాది మార్చిలో నమోదైన అత్యధిక డిమాండ్ 15,623 మెగావాట్లను ఈ ఏడాది ఫిబ్రవరిలోనే అధిగమించడం గమనార్హం.
ఈ పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని విద్యుత్ సరఫరాను నిలకడగా కొనసాగించేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క సూచనల మేరకు విద్యుత్ సంస్థలు అధిక డిమాండ్‌కు అనుగుణంగా సరఫరా నిర్వహిస్తున్నాయి. ప్రజలకు ఎలాంటి అంతరాయం లేకుండా నాణ్యమైన విద్యుత్ అందించేందుకు విద్యుత్ పంపిణీ సంస్థలు కృషి చేస్తున్నాయి.
రాష్ట్రంలో మరింత డిమాండ్ పెరిగే అవకాశముందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో విద్యుత్ సంస్థల పనితీరును సమీక్షించేందుకు భట్టి విక్రమార్క ఫిబ్రవరి 14న అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు. విద్యుత్ సరఫరాలో ఎలాంటి సమస్యలు తలెత్తకుండా ముందస్తు ప్రణాళిక రూపొందించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది.
వచ్చే రోజులలో విద్యుత్ వినియోగం ఇంకా పెరిగే అవకాశం ఉన్నందున అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులను ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఆదేశించారు. ప్రజలకు నిరంతర విద్యుత్ అందించేందుకు అన్ని చర్యలు తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు.
